Chandrababu: కూటమిని ఆశీర్వదించిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు: చంద్రబాబు
- ఏపీలో టీడీపీ కూటమిదే విజయం
- ఏపీ గెలిచింది, ఏపీ ప్రజలు గెలిచారు అంటూ చంద్రబాబు స్పందన
- ఓట్ల వెల్లువతో కూటమిని ఆశీర్వదించారని వెల్లడి
టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి సందేశం వెలువరించారు.
"ఏపీ గెలిచింది. ఏపీ ప్రజలు గెలిచారు. ఇవాళ నా హృదయం కృతజ్ఞతాభావంతో ఉప్పొంగుతోంది. ఓట్ల వెల్లువతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని ఆశీర్వదించిన మన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడి గెలిచాం. దెబ్బతిన్న రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకునేందుకు కలిసికట్టుగా కృషి చేస్తాం.
ఈ సందర్భంగా ఏపీ భవిష్యత్తుకు కట్టుబడి ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏపీలో మా కూటమి భారీ విజయం సాధించిన నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిలను అభినందిస్తున్నాను.
మా కూటమి కార్యకర్తలు, నేతల కఠోర శ్రమ, అంకితభావం ఫలితంగా ఈ చారిత్రాత్మక విజయం సాకారమైంది. చివరి ఓటు కూడా పడే వరకు వాళ్లు తెగించి పోరాడిన తీరు అద్భుతం. ఈ సందర్భంగా మా కూటమి నేతలకు, కార్యకర్తలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అంటూ చంద్రబాబు స్పందించారు.
ఇది చెడుపై మంచి సాధించిన విజయం: నారా లోకేశ్
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయం సాధించడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఈ విజయం ఎంతో ప్రత్యేకం అని అభివర్ణించారు.
"ఈ విజయం... చెడుపై మంచి, అబద్ధాలపై నిజాలు, అధర్మంపై ధర్మం, దుర్మార్గంపై మంచితనం, అవినీతిపై నీతి, విధ్వంసంపై అభివృద్ధి సాధించిన విజయం. ఇది ఏపీ ప్రజలకు, అవినీతి పాలనతో రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసిన పాలకులకు మధ్య జరిగిన యుద్ధం. చివరికి మనమే గెలిచాం" అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.