Elections: పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!
- ఎన్డీఏ కూటమికి 293 సీట్లు.. మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి ప్రధాని కానున్న మోదీ
- 99 సీట్లలో గెలిచిన కాంగ్రెస్.. ఇండియా కూటమికి 235 సీట్లు
- ఈసారి 240 సీట్లకే పరిమితమైన బీజేపీ.. 2019తో పోలిస్తే తగ్గిన సీట్లు
- సొంతంగా 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్ చేరలేకపోయిన వైనం
దేశవ్యాప్తంగా 543 ఎంపీ సీట్లకుగాను 542 సీట్ల ఫలితాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మహారాష్ర్టలోని బీడ్ నియోజకవర్గం ఫలితం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. అక్కడ ప్రస్తుతానికి బీజేపీ అభ్యర్థి పంకజా ముండేపై ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థి బజ్ రంగ్ మనోహర్ సోన్వానే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ సూరత్ నియోజకవర్గ అభ్యర్థి ముకేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో అక్కడ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ అవసరం రాలేదు.
ఈ ఎన్నికల్లో మొత్తంమీద కేంద్రంలోని అధికార బీజేపీ 240 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లను మాత్రం సాధించలేకపోయింది. ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ 16 సీట్లు, జేడీయూ 12 సీట్లతోపాటు ఇతర మిత్రపక్ష పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. మొత్తంగా ఎన్డీఏ కూటమి 293 సీట్లలో బలం పొందింది. దీంతో ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో సొంతంగా 303 సీట్లు గెలుచుకున్న బీజేపీ 2014 లోక్ సభ ఎన్నికల్లో 282 సీట్లు గెలుచుకుంది.
మరోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు సాధించింది. 2019 ఎన్నికల్లో సాధించిన 52 సీట్ల సంఖ్యను దాదాపుగా రెట్టింపు చేసుకుంది. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన విపక్ష ఇండియా కూటమిలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ యూపీలో 37 సీట్లలో విజయఢంకా మోగించింది. ఇక ఈ కూటమిలోని మరో పార్టీ అయిన పార్టీ తృణమూల్ కాంగ్రెస్ సైతం 29 సీట్లలో గెలుపొందింది. 2019 ఎన్నికల్లో సాధించిన 22 ఎంపీ సీట్ల లెక్కను మెరుగుపరుచుకుంది. రాజస్తాన్, హర్యానాలలో బీజేపీ సీట్లకు కాంగ్రెస్ గండికొట్టగా యూపీలో బీజేపీ సీట్లకు సమాజ్ వాదీ పార్టీ ఎసరుపెట్టింది. మొత్తంగా ఇండియా కూటమి 235 సీట్లు సాధించింది.
పార్టీ పేరు | సీట్లు |
---|---|
భారతీయ జనతా పార్టీ - BJP | 240 |
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ - INC | 99 |
సమాజ్‌వాది పార్టీ - SP | 37 |
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ - AITC | 29 |
ద్రవిడ మున్నేట్ర కజగం - DMK | 22 |
తెలుగు దేశం - TDP | 16 |
జనతా దళ్ (యునైటెడ్) - JD(U) | 12 |
శివసేన (ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే) - SHSUBT | 9 |
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్‌చంద్ర పవార్ - NCPSP | 8 |
శివసేన - SHS | 7 |
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) - LJPRV | 5 |
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ - YSRCP | 4 |
రాష్ట్రీయ జనతా దళ్ - RJD | 4 |
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) - CPI(M) | 4 |
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ - IUML | 3 |
ఆమ్ ఆద్మీ పార్టీ - AAAP | 3 |
జార్ఖండ్ ముక్తి మోర్చా - JMM | 3 |
జనసేన పార్టీ - JnP | 2 |
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) (లిబరేషన్) - CPI(ML)(L) | 2 |
జనతా దళ్ (సెక్యులర్) - JD(S) | 2 |
విడుతలై చిరుతైగల్ కాచ్చి - VCK | 2 |
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా - CPI | 2 |
రాష్ట్రీయ లోక్ దళ్ - RLD | 2 |
జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ - JKN | 2 |
యునైటెడ్ పీపుల్స్ పార్టీ, లిబరల్ - UPPL | 1 |
అసోం గణ పరిషత్ - AGP | 1 |
హిందుస్థానీ ఆవామ్ మోర్చా (సెక్యులర్) - HAMS | 1 |
కేరళ కాంగ్రెస్ - KEC | 1 |
రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ - RSP | 1 |
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - NCP | 1 |
వాయిస్ ఆఫ్ ద పీపుల్ పార్టీ - VOTPP | 1 |
జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ - ZPM | 1 |
శిరోమణి అకాళి దళ్ - SAD | 1 |
రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ - RLTP | 1 |
భారత్ ఆదివాసి పార్టీ - BHRTADVSIP | 1 |
సిక్కిం క్రాంతికారి మోర్చా - SKM | 1 |
మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం - MDMK | 1 |
ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) - ASPKR | 1 |
అప్నా దళ్ (సోనెలాల్) - ADAL | 1 |
AJSU పార్టీ - AJSUP | 1 |
ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తేహదుల్ ముస్లిమీన్ - AIMIM | 1 |
స్వతంత్రులు - IND | 7 |
మొత్తం | 543 |