Andhra Pradesh Assembly: వైఎస్సార్ సీపీ భారీ ఓటమికి దారితీసిన 13 కారణాలు.. ఆంగ్ల మీడియా విశ్లేషణ!

Analysis 13 Reasons Why Jagan Reddy Lost In Andhra Pradesh

  • చంద్రబాబు అరెస్టు, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై విపక్షాల ప్రచారం వైఎస్సార్ సీపీని దెబ్బతీశాయి
  • ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లలో తీవ్ర వ్యతిరేకత కూడా ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణమైంది
  • విశ్లేషించిన ప్రముఖ ఆంగ్ల వార్తాసంస్థ ఎన్డీటీవీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ సీపీ) ఘోర పరాజయం వెనక 13 ప్రధాన కారణాలు ఉన్నట్లు ప్రముఖ ఆంగ్ల వార్తాసంస్థ ఎన్డీటీవీ విశ్లేషించింది. ఆ కారణాల వల్లే పార్టీ 2019లో సాధించిన 151 సీట్లు, 50 శాతం ఓట్ల శాతం నుంచి ప్రస్తుతం 11 సీట్లకే పరిమితమైందని తెలిపింది. ఇందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటంటే...

1. ఎన్నికలకు కేవలం 8 నెలల ముందు అంటే.. 2023  సెప్టెంబర్ లో అవినీతి ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేయడం ఆయన అభిమానులు, మద్దతుదారులకు రుచించలేదు. తెలుగునాట రాజకీయ నాయకత్వానికి చంద్రబాబును చిహ్నంగా గుర్తించే విద్యాధికులంతా ఈ పరిణామాన్ని ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపుగానే పరిగణించారు. అప్పటికప్పుడు ఆయనకు నేరుగా సంఘీభావం ప్రకటించనప్పటికీ ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలవడం ద్వారా తమ మద్దతు పలికారు.

2. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో సినీ పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు అండగా నిలవడం తెలుగు రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబును కలిశాక పవన్ చేసిన ప్రకటన డీలాపడ్డ టీడీపీ క్యాడర్ లో జోష్ నింపింది. 


3. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను మార్చక కేసీఆర్ ఓటమిపాలయ్యారు. దీంతో అక్కడి ప్రజలు అధికార పార్టీకి చెప్పిన గుణపాఠాన్ని గుర్తించిన వైఎస్ జగన్.. ఎన్నికల్లో తన పార్టీకి చెందిన 102 మంది అభ్యర్థులను మార్చారు. అయితే ఈ నిర్ణయం ఫలితం ఇవ్వలేదు.

4. ఎన్డీఏ కూటమిలో టీడీపీ తిరిగి చేరడం ఆ పార్టీతోపాటు జనసేన, బీజేపీకి కలిసి వచ్చింది. మూడు పార్టీల నేతలు తరచూ సమావేశమై ఎన్నికల లెక్కలు వేసుకోవడం పార్టీల క్యాడర్ కు సానుకూల సంకేతాలు పంపింది. ఫలితంగా మూడు పార్టీలు పోటీ చేసిన సీట్లలో ఓట్ల బదిలీ ఎక్కడా ఇబ్బందుల్లేకుండా సజావుగా సాగింది.

5. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలకు ఉపయోగం జరిగినా దీనివల్ల అధికార యంత్రాంగం నిరాదరణకు గురైంది. ఇది అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తిని రాజేసింది. ముఖ్యంగా తాము టీడీపీ మద్దతుదారులు లేదా సానుభూతిపరులమనే విషయం బయటకు తెలిస్తే దాడులు చేస్తారేమోనన్న భయం చాలా మందిని వెంటాడింది.

6. వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధిపై ఏమాత్రం దృష్టిపెట్టలేదన్న వాదన ప్రజల్లోకి బలంగా వెళ్లింది. వృద్ధులకు పెన్షన్ల పంపిణీని స్వాగతించిన యువత.. తమకు ఉద్యోగాలు, తమ భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో కూటమి పార్టీలు న్యాయం చేస్తాయన్న ఉద్దేశంతో టీడీపీ, జనసేన, బీజేపీకి పట్టంకట్టారు.

7. చంద్రబాబు, లోకేశ్ పదేపదే జగన్ ను సైకోగా అభివర్ణించారు. జగన్ బాబాయ్ అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై ఐదేళ్లు అవుతున్నా దోషులు అరెస్టు కాకపోవడంతో ‘హూ కిల్డ్ బాబాయ్?’ అనే ప్రశ్నను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఇది ప్రజల మనసులో తీవ్ర అనుమానాలు రేకెత్తించింది. కడప ఎంపీగా పోటీ చేసిన జగన్ సోదరి వైఎస్ షర్మిల తన ఎన్నికల ప్రచారంలో అన్నపై తీవ్ర ఆరోపణలు చేసింది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాశ్ రెడ్డి కుటుంబాన్ని జగన్ వెనకేసుకొస్తున్నారని ప్రచారంలో పదేపదే ప్రస్తావించింది. దీంతో రాజకీయ అవసరాల కోసం సొంత కుటుంబ సభ్యులను జగన్ దూరం పెట్టారని.. కుటుంబ బంధాలకు ఏమాత్రం విలువ ఇవ్వట్లేదన్న భావన ప్రజల్లోకి వెళ్లింది.

8. తెలంగాణలో కేసీఆర్ చుట్టూ కోటరీ ఉన్నట్లుగానే ఏపీలో జగన్ చుట్టూ కూడా కోటరీ ఏర్పడింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఏమిటో ఆయనకు తెలియనివ్వకుండా చేసింది. దీనివల్ల కేసీఆర్ లాగా జగన్ కు సైతం అధికారగర్వం తలకెక్కిందని, ఆయన ఎవరికీ అందుబాటులో ఉండట్లేదన్న ముద్రపడింది.

9. వైఎస్సార్ సీపీకి ఒకే ఒక్క సైనికుడిగా, స్టార్ క్యాంపెయినర్ గా జగన్ ఒక్కరే నిలవడం దెబ్బతీసింది. మరోవైపు కూటమిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ విస్తృతంగా ప్రచారం చేయడం వారికి కలిసివచ్చింది. దీనికితోడు చివర్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ప్రచారంలో పాల్గొనడం ఆ పార్టీల క్యాడర్ లో ఉత్సాహం నింపింది. ఈ భారీ ప్రచార తీరును వైఎస్సార్ సీపీ అందుకోలేకపోయింది.

10. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 3,132 కిలోమీటర్ల యువగళం పాదయాత్ర ప్రజలకు ఆయన చేరువయ్యేందుకు దోహదపడింది. 

11. జగన్ అందిస్తున్న సంక్షేమానికి మించి అందిస్తామని చంద్రబాబు తన పార్టీ మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వడం ప్రజలను బాగా ఆకర్షించింది.

12. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చుట్టూ సాగిన ప్రచారం వైఎస్సార్ సీపీని తీవ్రంగా దెబ్బతీసింది. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలు భూములను లాక్కుంటారని.. ఈ చట్టం వల్ల వారసులకు భూమి బదిలీ చేయడం సాధ్యంకాదంటూ టీడీపీ, జనసేన చేసిన ప్రచారం ప్రజల్లో అనుమానాలు, భయాలు రేకెత్తించింది. ఈ ప్రచారాన్ని సకాలంలో తిప్పికొట్టడంలో వైఎస్సార్ సీపీ విఫలమైంది. ఈ పరిణామం ఆ పార్టీని ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బకొట్టింది.                   

13. ప్రభుత్వ ఉద్యోగుల సంఘటిత శక్తిని తక్కువగా అంచనా వేయడం అధికార పార్టీని దెబ్బతీసింది. సకాలంలో జీతాలు చెల్లించకపోవడం, రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వకపోవడం సుమారు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహానికి దారితీసింది. పలుచోట్ల జరిగిన డాక్టర్లపై దాడులు, టీచర్లకు అదనపు పనుల అప్పగింత వంటి పరిణామాలతో విసిగిపోయిన ఉద్యోగులు ఈ ప్రభుత్వాన్ని మార్చాలని ముందుగానే నిర్ణయించుకున్నారు.

  • Loading...

More Telugu News