VVPAT Slips: అవి వీవీప్యాట్ స్లిప్పులు కావు.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వివరణ
- ఎన్నికల ప్రచారంలో ఇచ్చే కరపత్రాలని వెల్లడించిన టీడీపీ నేత
- ఇంటింటికీ పంచే స్లిప్పులను వీవీప్యాట్ స్లిప్పులు అంటున్నారని ఫైర్
- వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
ఎన్నికల ప్రచారంలో ఉపయోగించే పార్టీ కరపత్రాలను పట్టుకుని వీవీప్యాట్ స్లిప్పులంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపడేశారు. వీవీప్యాట్ స్లిప్పులంటూ చూపిస్తున్న పేపర్లు నిజానికి ఎన్నికల ముందు ఓటర్లకు అవగాహన కల్పించి, తమ పార్టీ గుర్తుకే ఓటేసేలా చూడడానికి ముద్రించిన ప్రచార కరపత్రాలని వివరించారు.
వైసీపీ గుర్తు ఫ్యాన్, దానికి ఫ్యాన్ గుర్తుకే మన ఓటు అన్న అక్షరాలను గమనించాలంటూ ఆయన సూచించారు. ‘మాకు ఓటు వేయండి అంటూ ఎన్నికల ముందు ఇంటింటికీ పంచే స్లిప్స్, ఫ్యాన్ గుర్తుకు "మన ఓటు" అనే స్లిప్పులను పట్టుకుని, వీవీప్యాట్ స్లిప్స్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.