Chandrababu: ఎన్నికల్లో ఓడించడం వేరు... ఇక నువ్వు వద్దే వద్దు అని ఓటేయడం వేరు!: చంద్రబాబు

Chandrababu press meet in Mangalagiri

  • టీడీపీ కూటమి చారిత్రాత్మక విజయం సాధించిందన్న చంద్రబాబు
  • ఈ ఎన్నికలతో అన్ని వర్గాల వారికి విముక్తి కలిగిందని వెల్లడి
  • ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనే లక్ష్యంగా కూటమిగా ఏర్పడినట్టు వివరణ
  • జగన్ చరిత్ర ఒక కేస్ స్టడీ అని వ్యాఖ్యలు

టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ముందుగా మీడియాకు స్వాతంత్ర్యం వచ్చిందని, ఆ తర్వాత ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని ఛలోక్తి విసిరారు. ఈ ఐదేళ్ల పాటు బాధలు పడిన వారందరికీ ఈ ఎన్నికలతో విముక్తి కలిగిందని అన్నారు. ఇక తాము ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. 

"ముందు మీడియాకి, ఆ తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు, శిరసు వంచి నమస్కరిస్తున్నా. నా సుదీర్ఘ రాజకీయ యాత్రలో ఈ ఐదేళ్లు ఉన్న ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. ఒక రంగం అని కాదు, ఒక వ్యవస్థ అని కాదు... ప్రజాస్వామ్య వ్యవస్థలు, అన్ని రంగాలను ఎలా నిర్వీర్యం చేశారో చూశాం. మా లక్ష్యం ఒక్కటే... ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అందుకోసం ఎన్ని త్యాగాలైనా చేసి మళ్లీ భావితరాల భవిష్యత్ కోసం ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. 

నేను చాలా  ఎన్నికలు చూశాను. ఇవి పదో ఎన్నికలు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉండడం సాధారణమైన విషయం. కానీ దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం... అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి, వ్యక్తులు కూడా కనుమరుగవుతారు. 

కానీ ఇంతటి చారిత్రక ఎన్నికలను ఎప్పుడూ చూడలేదు. నా జీవితంలో చాలా ఎన్నికలు చూశాను... వాటిలో వేవ్ కనిపించేది, ఏదైనా పార్టీపై వ్యతిరేకత కనిపించేది... కానీ ఈ ఎన్నికలు చూస్తే... కసి కనిపించింది. ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తులు కూడా ఐదు లక్షలు ఖర్చుపెట్టుకుని వచ్చారు... ఓటేయాలి, రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు. 

పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన వ్యక్తులు కూడా సొంత డబ్బులు పెట్టుకుని వచ్చి ఓటేశారు. భోజనం కూడా వెంట తెచ్చుకుని మరీ ఓటేశారు. వాళ్ల నిబద్ధతను ఏ విధంగా అభినందించాలో కూడా అర్థంకాని పరిస్థితి! 

అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం కానీ... తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది. ఒక హిస్టారికల్ ఎన్నిక. 

నాడు ఎన్టీఆర్ నాయకత్వంలో 1983లో టీడీపీ తిరుగులేని విజయం సాధించింది. అప్పుడు కొత్త పార్టీ అయినప్పటికీ 200 సీట్లు వచ్చాయి. 1994లో ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం వల్ల, ప్రజా వ్యతిరేకత వల్ల ఎన్నికలు వచ్చాయి. అప్పుడు విపక్ష హోదా కోసం రావాల్సిన సీట్లు కూడా రాలేదు. అవన్నీ మరిపించేలా ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 

ఏపీలో ఇప్పుడు ఇలాంటి ఫలితాలు ఎందుకు  వచ్చాయో ప్రత్యేకించి నేను కారణాలు చెప్పక్కర్లేదు. అనుభవించిన ప్రజలకు తెలుసు. ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో మాట్లాడడం అనేది ఒక ప్రాథమిక హక్కు. ఆ మాట్లాడే హక్కునే కోల్పోవాల్సి వచ్చింది... అదే కాదు... బ్రతికే స్వేచ్ఛ, ఆస్తులను కలిగివుండే స్వేచ్ఛ... ఇవన్నీ కోల్పోయే పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో మా మూడు పార్టీలు ఏ విధంగా కలిశాయో మా కంటే మీడియాకే ఎక్కువ తెలుసు. అప్పుడూ, ఇప్పుడూ మా ఆలోచన ఒక్కటే... ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి... అంతవరకు సాధించగలిగాం. 

ఈ ఎన్నికల్లో కూటమికి 55.38 శాతం ఓట్లు పడ్డాయి. ఇందులో టీడీపీకి 45.06 శాతం ఓట్లు వచ్చాయి. అదే సమయంలో, వైసీపీకి 39.37 శాతం ఓట్లు పడ్డాయి. ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో చార్మినార్ నియోజకవర్గంలో 90 వేల దాకా అత్యధిక మెజారిటీ వచ్చేది. ఆ తర్వాత రెండో స్థానం కోసం కుప్పం, సిద్ధిపేట పోటీ పడేవి. అప్పుడు కూడా 70 వేలు, 80 వేల వద్ద ఆగిపోయేవాళ్లం. 

ఈ ఎన్నికల్లో 95 వేల మెజారిటీ (గాజువాక) వచ్చింది. రెండో స్థానంలో 94 వేల మెజారిటీ (భీమిలి), మంగళగిరిలో 91 వేల మెజారిటీ వచ్చింది. ఈ ట్రెండ్ ను ఏ విధంగా అభివర్ణించాలో నాకు అర్థం కావడంలేదు. 

ప్రజలు ఇచ్చిన తీర్పు చూస్తే... అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం, నేనేమైనా చేస్తాను అనే ధోరణిని ప్రజలు క్షమించే పరిస్థితిలో లేరు... అదే ఈ రోజు నిరూపించారు. ఈ గుణపాఠం పాలకులకే కాదు... అవినీతి, అహంకారంతో ముందుకుపోయే ఎలాంటి విధ్వంసకారులకైనా ఇదే జరుగుతుంది అని ప్రజలు చాటి చెప్పారు. అందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 

ఈ ఐదేళ్లు మా కార్యకర్తలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చాలామంది నిద్రలేని రాత్రులు గడిపారు. కంటినిండా నిద్రపోలేని పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఈ ఐదేళ్లు మీడియా పడిన ఇబ్బందులు కూడా అన్నీఇన్నీ కావు. మీడియా వాళ్లు కోర్టుల చుట్టూ తిరిగిన వైనం, మీడియా ప్రతినిధులను సీబీసీఐడీ ఆఫీసులో పెట్టి వేధించిన విధానం... అవన్నీ తలుచుకుంటే ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలదించుకోవాలి. 

జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ విశాఖ వెళితే నగర బహిష్కరణ చేసే పరిస్థితులు చూశాం. కారణం చెప్పకుండానే నన్ను అరెస్ట్ చేశారు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత... ఐక్యంగా ముందుకు కదిలాం. మేం పాలకులమే కాదు సేవకులం అనే విషయాన్ని గుర్తుంచుకుని పనిచేస్తాం. 

మేం సూపర్ సిక్స్, ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం... ఇవన్నీ ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ప్రజల్లో ఒక ఆశావహదృక్పథం ఏర్పడింది. వీటన్నింటి ఫలితాలే నిన్న కూటమి విజయాల రూపంలో వచ్చాయి. 

ఈ ఐదేళ్లలో రాష్ట్రం ఒక 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. ఎంత డ్యామేజి జరిగిందో చెప్పలేం, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అప్పులైతే ఇంకా లోతుకు పోతే తప్ప ఎంత చేశారో తెలియదు. 

పాలకుడు అంటే ఎలా ఉండకూడదో, ఎలాంటి వ్యక్తులకు రాజకీయ అర్హత లేదో అలాంటి వ్యక్తి జగన్. జగన్ చరిత్ర ఒక కేస్ స్టడీ వంటిది. రాష్ట్ర చరిత్రను చూస్తే... పాలకులు అంటే ఇలా ఉండాలి అనేలా అనేకమంది నాయకులు పనిచేశారు. పాలకుడు అంటే ఎలా ఉండకూడదో చెప్పేలా ప్రపంచానికి ఒక కేస్ స్టడీ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. గతంలో ఎన్నికల్లో చాలామంది ఓడిపోయారు కానీ... ఇక నువ్వు వద్దే వద్దు అని ఓటేయడం ఎప్పుడూ జరగలేదు. కానీ ఈసారి ఎన్నికల్లో జరిగింది అదే" అంటూ చంద్రబాబు వివరించారు. 

ఇక, ఎన్డీయే సమావేశం కోసం ఇవాళ ఢిల్లీ వెళుతున్నానని, రాష్ట్రానికి వచ్చిన తర్వాత మళ్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అనేక విషయాలు మాట్లాడతానని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News