Chandrababu: ఎన్డీయే కూటమికి ఈసారి చంద్రబాబే ఆక్సిజన్!
- దేశంలో ముగిసిన అత్యంత కీలక ఘట్టం
- నిన్నటితో పూర్తయిన ఎన్నికల క్రతువు
- 293 స్థానాలు సాధించిన ఎన్డీయే కూటమి
- అందులో టీడీపీ భాగస్వామ్యం 16 సీట్లు
- జేడీయూకి 14 సీట్లు వచ్చినా, నితీశ్ కుమార్ పై ఎన్డీయేకి అపనమ్మకం!
దేశంలో అత్యంత కీలక ప్రజాస్వామ్య ఘట్టం అయిన సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి 293 స్థానాలతో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి 233 స్థానాలతోనే సరిపెట్టుకోవడంతో... ఎన్డీయేకు అడ్డులేకుండా పోయింది.
కానీ, గత ఎన్నికలతో పోల్చితే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి సీట్లు తగ్గాయి. 2019లో బీజేపీ సొంతంగా 303 స్థానాల్లో గెలవగా, ఎన్డీయే కూటమికి 353 సీట్లు వచ్చాయి. ఈసారి బీజేపీ సొంతంగా 240 స్థానాలకే పరిమితం కాగా, ఎన్డీయే బలం 293 సీట్ల వరకే ఆగిపోయింది. టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీలు కలిసి రావడంతో ఆ మాత్రమైనా సీట్లు వచ్చాయి. లేకపోతే ఎన్డీయే పరిస్థితి ఇబ్బందికరంగా మారేది.
బీజేపీ తర్వాత... మిత్ర పక్షాల్లో అత్యధిక స్థానాలు గెలిచింది టీడీపీ, జేడీయూ పార్టీలే. టీడీపీ 16, జేడీయూ 14 మంది ఎంపీలను ఎన్డీయే కూటమికి అందించాయి. శివసేన ఏక్ నాథ్ షిండే వర్గం ఏడుగురు ఎంపీలను అందించింది. ఎన్డీయేలో ఉన్న ఇక ఇతర మిత్రపక్షాలన్నీ చిల్లచిల్లరగా మూడ్నాలుగు సీట్లు, ఒకట్రెండు సీట్లు... ఇలా గెలిచాయే తప్ప... బీజేపీకి గట్టిగా నిలబడి సపోర్ట్ చేసే స్టామినా వాటికి లేదు. దాంతో ఇప్పుడందరి దృష్టి టీడీపీ నేషనల్ ప్రెసిడెంట్ చంద్రబాబుపైనే ఉంది.
చంద్రబాబు రాజకీయ వ్యూహాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక సంక్షోభాల నుంచి పార్టీని, ప్రభుత్వాలను సేఫ్ గా ఉంచిన చరిత్ర ఆయన సొంతం. ఒక ప్రాంతీయ పార్టీని నాలుగు దశాబ్దాల పాటు సక్సెస్ పుల్ గా నడిపించడం, అదే ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకునేలా ఓ రేంజికి తీసుకెళ్లడం చంద్రబాబు నాయకత్వానికి నిదర్శనం.
ఎన్డీయే కూటమికి చంద్రబాబు కొత్త కాదు, చంద్రబాబుకు ఎన్డీయే కూటమీ కొత్త కాదు. 2014లోనూ టీడీపీ, బీజేపీ కలిసి పనిచేశాయి. మధ్యలో 2019లో కాస్త గ్యాప్ వచ్చినా... ఇప్పుడా గ్యాప్ లేదు కాబట్టి ఇబ్బందే లేదు.
కానీ, బీజేపీ గతంలో మాదిరిగా కమాండ్ చేసే పొజిషన్ లో లేదని చెప్పాలి. ఎందుకంటే... ఈసారి బీజేపీ సొంతంగా ఎక్కువ సీట్లు గెలవలేకపోయింది. దాంతో తప్పనిసరిగా ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే... లోక్ సభలో మ్యాజిక్ ఫిగర్ సాధించాలి.
లోక్ సభలో మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు. టీడీపీతో పాటు ఇంకొన్ని మిత్రపక్షాలు ఎన్డీయేకి మద్దతు వెనక్కి తీసుకుంటే మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవడం బీజేపీకి సాధ్యం కాదు. అందుకే ఇప్పుడు టీడీపీ వంటి ప్రొంతీయ పార్టీలు బీజేపీకి అత్యంత అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీయేకి చంద్రబాబే ఆక్సిజన్ అని చెప్పాలి.
బీహార్ కు చెందిన జేడీయూ పార్టీ 14 మంది ఎంపీలను అందించినా... ఆ పార్టీ సారథి నితీశ్ కుమార్ ట్రాక్ రికార్డు అంతంతమాత్రమే. ఆయన ఎప్పుడు హ్యాండిస్తాడో తెలియదు. 2022లోనూ ఓసారి నితీశ్ ఎన్డీయే కూటమిలో కలకలం రేపారు. ఓవైపు ఎన్డీయేలో ఉంటూనే కాంగ్రెస్ నాయకురాలు సోనియాతో టచ్ లో ఉండేవారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎన్డీయేకి, జేడీయూకి చెడిందని... నితీశ్ కుమార్ కాంగ్రెస్ తో చేయి కలుపుతారని మొన్నమొన్నటి వరకు ప్రచారం జరుగుతూనే ఉంది. అలాంటి నితీశ్ కుమార్ ను ఎంత వరకు నమ్మవచ్చో బీజేపీ హైకమాండ్ కు బాగా తెలుసు.
నితీశ్ కుమార్ తో ఎన్డీయే విభేదాలు ఏవైనా ఉంటే అవి రాజకీయ పరమైన అంశాలే తప్ప, అక్కడ ప్రజాప్రయోజనాలేవీ లేవు. ఓ దశలో ఎన్డీయేని వీడి... బీహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీతో జట్టు కట్టి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూసిన నేత నితీశ్ కుమార్. కానీ, చంద్రబాబు అలాంటి సంకీర్ణ రాజకీయాల జోలికి ఎప్పుడూ వెళ్లలేదు.
రాష్ట్ర విభజన సమయంలో పసిబిడ్డ లాంటి ఏపీ కోసం, రాష్ట్ర ప్రజల కోసం, ఇప్పుడు ధ్వంసమైపోయిన రాష్ట్రం కోసం, బాధితుల్లా మారిన రాష్ట్ర ప్రజల కోసం ఎన్డీయేతో కలిశానని నిర్భయంగా చెప్పిన నేత చంద్రబాబు. ఏపీ విషయంలో, టీడీపీ విషయంలో, ముఖ్యంగా చంద్రబాబు విషయంలో ఎన్డీయేకి గతంలో ఏవైనా విభేదాలు వచ్చినా... అందులో రాజకీయ అంశం ఒక్కటి కూడా కనిపించదు.
చంద్రబాబు నాటి ఎన్డీయేతో విభేదించడానికి ప్రధాన కారణాలుగా ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం వంటి ప్రజాప్రయోజన అంశాలే కనిపిస్తాయి. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా చెప్పారు. ఎన్డీయే, చంద్రబాబు విడిపోయినా ఇరుపక్షాల మధ్య శత్రుత్వమేమీ లేదు. అందుకే... చంద్రబాబు ఎప్పుడొచ్చినా తలుపులు తెరిచే ఉంటాయని... ఎన్డీయే ఎప్పుడూ చెబుతుంటుంది.
ఇప్పుడు చంద్రబాబు ఎన్డీయేతో కలిసింది కూడా ప్రజాప్రయోజనాల కోసమే. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీయేలో చంద్రబాబు పరపతి మరింత పెరగనుంది. రాజకీయ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే నితీశ్ కుమార్ కంటే... ప్రజాప్రయోజనాలు, అభివృద్ధి తప్ప మరో మాట మాట్లాడని చంద్రబాబు వంటి నికార్సయిన నాయకుడే ఎన్డీయేకి ముద్దు. అలాంటి నేతని వద్దు అని ఎలా అనగలరు?