Narendra Modi: ఎన్నికల ఫలితాల్లో నెంబర్ గేమ్ ఉంటుంది... రాజకీయాల్లో ఇది భాగమే: నరేంద్ర మోదీ
- కేంద్రమంత్రి వర్గం చివరి సమావేశంలో నరేంద్ర మోదీ
- గెలుపోటములు రాజకీయాల్లో సాధారణమేనని వ్యాఖ్య
- అవినీతిపై పోరాటం పటిష్ఠంగా మారుతోందన్న మోదీ
- రాజకీయాల కోసం కొంతమంది అవినీతిని కీర్తిస్తున్నారని విమర్శ
ఎన్నికల ఫలితాల్లో నెంబర్ గేమ్ ఉంటుందని... ఇది రాజకీయాల్లో భాగమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గెలుపోటములు రాజకీయాల్లో సాధారణమే అన్నారు. బుధవారం ప్రధాని నివాసంలో కేంద్రమంత్రివర్గం చివరిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... పదేళ్లలో దేశ అభివృద్ధికి మన ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు. అందుకు మీరంతా శ్రమించారని వారితో అన్నారు. దీనిని ఇలాగే కొనసాగించాలని సూచించారు. అవినీతిపై పోరాటం మరింత పటిష్ఠంగా మారుతోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది అవినీతిని కీర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈసారి అవినీతిని రూపుమాపడంపై ఎన్డీయే దృష్టి సారిస్తుందన్నారు. ప్రపంచంలో భారత్ బలమైన శక్తిగా అవతరిస్తోందని వ్యాఖ్యానించారు. అందరం కలిసి కృషి చేస్తే సరికొత్త అధ్యాయాన్ని లిఖించవచ్చునన్నారు. ఇది దేశ ప్రజలకు మోదీ హామీ అన్నారు. కొంతమంది పది గంటలు పని చేస్తే తాను మాత్రం దేశం కోసం 18 గంటలు పని చేస్తున్నానని తెలిపారు. ఎవరైనా దేశం కోసం రెండు అడుగులు వేస్తే తాను నాలుగు వేస్తానన్నారు. అన్ని వర్గాలు, ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.