Team India: ఐర్లాండ్ ను 96 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా... కానీ...!
- టీ20 వరల్డ్ కప్ లో నేడు తొలి మ్యాచ్ ఆడుతున్న టీమిండియా
- ఐర్లాండ్ పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ సేన
- పిచ్ ప్రమాదకరంగా స్పందిస్తున్న వైనం
- బ్యాటింగ్ చేసేందుకు తీవ్రంగా ఇబ్బందిపడిన ఐర్లాండ్ ఆటగాళ్లు
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఇవాళ తన తొలి మ్యాచ్ ను ఐర్లాండ్ తో ఆడుతోంది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ పిచ్ బౌలింగ్ కు అనుకూలించింది అనడం కంటే... బ్యాట్స్ మన్ల పాలిట ప్రమాదకరంగా మారింది అనడం సబబుగా ఉంటుంది. ఉవ్వెత్తున బౌన్స్ అవుతున్న బంతులతో ఐర్లాండ్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో స్వింగ్ కూడా ఉండడం, కొన్ని బంతులు మరీ తక్కువ ఎత్తులో రావడం బ్యాట్స్ మన్లను అయోమయానికి గురిచేసింది. ఓవరాల్ గా అతికష్టమ్మీద ఐర్లాండ్ ఆ మాత్రం పరుగులు చేయగలిగింది.
ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో గారెత్ డెలానీ అత్యధికంగా 26 పరుగులు చేశాడు. జాషువా లిటిల్ 14, కర్టిస్ కాంఫర్ 12, లోర్కాన్ టకర్ 10 పరుగులు చేశారు.
టీమిండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3, అర్షదీప్ సింగ్ 2, బుమ్రా 2, సిరాజ్ 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. ఎప్పుడెలా స్పందిస్తుందో తెలియని ఈ పిచ్ పై టీమిండియా బ్యాటర్లు ఎలా ఆడతారన్నది ఆసక్తికరంగా మారింది.