Chandrababu: మీకు ఇంకా ఎందుకు ఆ సందేహం?: చంద్రబాబు సూటి ప్రశ్న

Why You Got That Doubt  Chandrababu Naidu Asserts Hes In NDA

  • ఎన్డీయేతోనే తన పయనమని స్పష్టం చేసిన టీడీపీ అధినేత
  • ఎన్డీయే భాగస్వాముల సమావేశం అనంతరం మీడియాతో ముచ్చటించిన బాబు
  • ఎన్నికల్లో కలిసి పోరాడామని, కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టీకరణ

భారత సార్వత్రిక ఎన్నికలు మరోసారి సంకీర్ణ ప్రభుత్వాల యుగానికి నాంది పలికాయి. బీజేపీ సొంతంగా మెజార్టీ మార్కు దాటకపోవడంతో ఎన్డీయే కూటమిలో చంద్రబాబు, నితీశ్ కుమార్‌లు కింగ్ మేకర్లుగా మారారు. అయితే, టీడీపీ, జేడీయూ అధినేతలను ప్రతిపక్ష ఇండియా కూటమి తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోందన్న వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ కథనాలకు టీడీపీ అధినేత ముగింపు పలికారు. ‘‘ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా కలిసి పోటీ చేశాం కదా. అయినా మీకెందుకు ఈ సందేహం కలుగుతోంది’’ అని ఆయన మీడియాను ఉద్దేశించి ప్రశ్నించారు. 

బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు జరిగిన ఈ సమావేశానికి టీడీపీ అధినేత కూడా హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను ఎన్డీఏలోనే కొనసాగనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ కూడా పాల్గొన్నారు. శివసేన నేత ఎక్‌నాథ్ షిండే, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఎల్‌జేపీ నేత చిరాగ్ పాస్వాన్, ఎన్సీపీకి చెందిన ప్రఫుల్ పటేల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్డీయే కూటమి నేతలు మోదీకి లిఖితపూర్వకంగా తమ మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది. దీంతో, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం ఖరారైపోయింది. శనివారం నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు సహా ఎన్డీయే భాగస్వాములందరూ హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News