Instagram: ఆఫ్ఘనిస్థాన్ అదుర్స్.. టూర్ వీడియో పంచుకున్న అమెరికా వ్లాగర్
- తాలిబాన్ల చెరలో ఉన్న దేశంలో నిర్భయంగా పర్యటన
- ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాల సందర్శన
- అక్కడి సంస్కతి, సంప్రదాయాలను చూసి అచ్చెరువొందిన ఎలీ స్నైడర్
ఆఫ్ఘనిస్థాన్ పేరు చెబితే తాలిబాన్ల అరాచకాలు గుర్తొచ్చి చాలా మంది భయపడతారు. అలాంటిది ఆ దేశంలో ఒక విదేశీయుడు.. అందులోనూ అమెరికన్ పర్యటించడం అంటే సాహసమే అవుతుంది. అమెరికాకు చెందిన ఎలీ స్నైడర్ అనే ట్రావెల్ వ్లాగర్ ఆ సాహసాన్ని చేసి చూపించాడు. భద్రతా ముప్పు ఉంటుందన్న హెచ్చరికలను బేఖాతరుచేస్తూ ఆఫ్ఘన్ లో పర్యటించాడు. అక్కడి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలతోపాటు ప్రజల ఆహార అలవాట్లు, పద్ధతులు, నిబంధనల గురించి నెటిజన్లకు వివరిస్తూ రెండు వీడియోలు పంచుకున్నాడు.
తన వీడియో సిరీస్ ఆరో ఎపిసోడ్ లో భాగంగా ఆఫ్ఘన్ లోని మూడో అతిపెద్ద నగరమైన మజర్ ఏ షరీఫ్ లో చేపట్టిన టూర్ విశేషాలను వెల్లడించాడు. ఇందుకోసం ఒక ప్రైవేటు ట్యాక్సీ మాట్లాడుకున్నట్లు చెప్పాడు. ఆ వీడియోలో చేతిలో తుపాకులు పట్టుకున్న తాలిబన్లతో కలిసి స్నైడర్ ఆఫ్ఘన్ వీధుల్లో కారులో వెళ్లడం కనిపించింది. తొమ్మిదో శతాబ్దంలో నిర్మించిన తొమ్మిది మినార్ల హాజీ పియాదా మసీదును, దాని నిర్మాణ శైలిని చూసి మంత్రముగ్ధుడయ్యాడు.
బాల్క్ ప్రావిన్సులో పర్యటిస్తూ కాసేపు సరదాగా ఉయ్యాల ఊగాడు. అలాగే ఒకరి ఇంట్లో కాబూలీ పులావు, ఇతర వంటకాలను సంప్రదాయ పద్ధతిలో నేలపై కూర్చొని తిన్నట్లు ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. అయితే మహిళలు, చిన్నారులు మాత్రం నేటికీ కఠిన నిబంధనల చట్రంలో జీవిస్తుండటం ఎంతో బాధించిందని పేర్కొన్నాడు. అతని పర్యటన ఆసాంతం తాలిబాన్లు తోడుగా వెంట వచ్చారు. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.
వీడియో ఇదిగో