T20 World Cup 2024: టీ20 వరల్డ్‌కప్‌లో సంచలనం.. పాకిస్థాన్‌ను ఓడించిన అమెరికా!
- డల్లాస్ వేదికగా పాకిస్థాన్, అమెరికా మ్యాచ్
- సూపర్ ఓవర్‌లో పాక్‌పై యూఎస్ సంచలన విజయం
- మొదట పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు
- లక్ష్యఛేదనలో యూఎస్ 20 ఓవర్లలో 3 వికెట్లకు సరిగ్గా 159 రన్స్
- సూపర్ ఓవర్‌లో అమెరికా 18 రన్స్.. పాక్ 13 పరుగులకే పరిమితం
ఐసీసీ మెగా టోర్నీ టీ20 వరల్డ్‌కప్‌లో సంచలనం నమోదైంది. డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా అద్భుత ప్రదర్శనతో టైటిల్ ఫేవరేట్లలో ఒకటైన పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చింది. సునాయాసంగా గెలుస్తామని భావించిన మ్యాచ్‌ను యూఎస్ సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లి సంచలన విజయం సాధించింది. ఆఖరి వరకు నువ్వా? నేనా? అన్నట్లు సాగిన పోరు (సూపర్ ఓవర్)లో ఆతిథ్య జట్టు చారిత్రక విజయం సాధించింది.
మహమ్మద్ అమీర్ వేసిన సూపర్ ఓవర్‌లో అమెరికా ఒక వికెట్ కోల్పోయి 18 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్ వికెట్ కోల్పోయి 13 పరుగులకు పరిమితమైంది. టీ20ల్లో పాక్‌పై అమెరికాకు ఇదే తొలి విజయం. అంతకుముందు టాస్ కోల్పోయి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది.
ఆ జట్టు బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజమ్ (44), షాదాబ్ ఖాన్ (40) రాణించారు. ఆఖర్లో ఆ జట్టు స్టార్ పేసర్ షహీన్ షా ఆఫ్రిది (16 బంతుల్లో 23 నాటౌట్) మెరుపులతో పాక్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రిజ్వాన్(9), ఉస్మాన్‌ఖాన్(3) ఫకర్ జమాన్(11), అజమ్‌ఖాన్(0) ఘోరంగా విఫలమయ్యారు.
అమెరికా బౌలర్లు సమష్టిగా రాణించి పాకిస్థాన్‌ను కట్టడి చేశారు. నొస్తుష్ కెంజిగె 3, నేత్రవల్కర్ 2 వికెట్లు పడగొట్టగా.. అలీ ఖాన్, జస్దీప్ సింగ్ చెరో వికెట్ తీశారు. అనంతరం 160 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన యూఎస్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సరిగ్గా 159 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది.
అమెరికా బ్యాటర్లలో ఓపెనర్ మోనాక్ పటేల్ అర్ధశతకం (50) తో రాణించాడు. అలాగే అరోన్ జోన్స్ (36 నాటౌట్), అండ్రిస్ గౌస్(35) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అమిర్, నసీమ్‌షా, రవూఫ్ తలో వికెట్ పడగొట్టారు. ఇక సూపర్ ఓవర్‌లో యూఎస్ ఒక వికెట్ కోల్పోయి 18 పరుగులు చేయగా, ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్ వికెట్ కోల్పోయి 13 పరుగులకు పరిమితమైంది. దీంతో యూఎస్ఏ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. హాఫ్ సెంచరీతో రాణించిన అమెరికా సారధి మోనాక్ పటేల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
పాక్‌ను దెబ్బకొట్టింది మనోళ్లే!
ఈ మ్యాచ్‌లో అమెరికా గెలుపొందడం వెనుక ఆ జట్టులోని భారత సంతతి ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ మోనాక్ పటేల్ బ్యాటింగ్‌లో 50 (38) అదరగొట్టగా, బౌలింగ్‌లో సౌరభ్ నేత్రావల్కర్ రెండు వికెట్లు పడగొట్టి పాక్ ఇన్నింగ్స్‌ను దెబ్బకొట్టాడు. అటు సూపర్ ఓవర్‌లోనూ నేత్రావల్కర్ ధాటికి పాక్ బ్యాటర్లు నిలవలేకపోయారు. ముంబైలో పుట్టిన ఈ పేసర్ గతంలో భారత అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.