Pinnelli Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి తాత్కాలిక ఊరట!

Pinneli bail Ramakrisha reddy bail extended till june 13

  • మధ్యంతర బెయిల్ గడువును పొడిగిస్తూ గురువారం రాత్రి హైకోర్టు ఉత్తర్వులు
  • పూర్తి వాదనలు వినేందుకు సమయం లేక ఈ నెల 13 వరకూ బెయిల్ పొడిగింపు
  • ఇరు పక్షాల న్యాయవాదుల అనుమతితో కోర్టు నిర్ణయం

ఎన్నికల సందర్భంగా అరాచకాలు సృష్టించిన కేసుల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. ఆయనపై నమోదైన నాలుగు కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13 వరకూ పొడిగించింది. గురువారం బెయిల్ పిటిషన్లపై వెకేషన్ బెంచ్ ప్రాథమిక విచారణ జరిపింది. అప్పటికే రాత్రి 10 దాటడం, పూర్థిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో ఇరు పక్షాల న్యాయవాదుల సమ్మతితో కోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల రోజు మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్ బూత్‌లో ఈవీఎంను బద్దలు కొట్టిన వ్యవహారంతో పాటు మరో రెండు హత్యాయత్నం కేసులు పిన్నెల్లిపై నమోదైన విషయం తెలిసిందే. 

విచారణ సందర్భంగా పిన్నెల్లి తరపున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి ప్రాథమిక వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్లపై గురువారమే విచారణ జరిపి వాటిని పరిష్కరించాలని సుప్రీం కోర్టు చెప్పలేదన్నారు. పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేనందున మరో రోజుకు వాయిదా కోరారు. మధ్యంతర ఉత్తర్వులను పొడిగించకపోతే అర్ధరాత్రి అరెస్టు చేయడానికి పిటిషనర్ ఇంటిచుట్టూ పోలీసులను మోహరించారన్నారు. 

టీడీపీ ఏజెంటు నంబూరి శేషగిరిరావు తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ ఎన్నికల సందర్భంగా పిన్నెల్లి అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయనపై నమోదైనవి తీవ్రమైన కేసులని చెప్పారు. ఈ కేసుల్లో అరెస్టు నుంచి ఉపశమనం కల్పించేందుకు అర్హత లేదన్నారు. 

ఈ ఘటనలో గాయపడిన కారంపూడి సీఐ నారాయణ స్వామి తరపు న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. సీఐపై అత్యంత దారుణంగా దాడి చేశారని అన్నారు. పోలీసుల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ పిన్నెల్లిపై నమోదైన కేసుల్లో రెండింటిలో ఏడేళ్లకు పైబడి శిక్ష విధించేందుకు వీలుందన్నారు. మరోవైపు, పిన్నెల్లి అరెస్టుపై రాత్రి వరకూ ఉత్కంఠ కొనసాగింది. బెయిల్ పొడిగిస్తూ రాత్రి హైకోర్టు ఉత్తర్వులు వెలువడ్డాక పరిస్థితి సద్దుమణిగింది.

  • Loading...

More Telugu News