Sunitha Williams: భారత సంతతి వ్యోమగామి 3వ స్పేస్ టూర్.. అంతరిక్ష కేంద్రంలో కాలుపెట్టగానే డ్యాన్స్

Indian Origin Astronaut Sunita Williams Dances On Her Arrival At Space Station

  • బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌ ‘కాలిప్సో’లో సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర
  • బుధవారం ఫ్లోరిడా నుంచి యూనైటెడ్ అలయెన్స్ అట్లాస్ ఫైవ్ రాకెట్‌తో క్యాప్సుల్ ప్రయోగం
  • గురువారం అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న కాలిప్సో
  • తొలుత థ్రస్టర్లు మొరాయిండంతో గంట సేపు ఆలస్యమైన డాకింగ్
  • ఐఎస్ఎస్‌లోకి కాలుపెట్టగానే సునీతా విలియమ్స్ డ్యాన్స్

భారత సంతతి అమెరికా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష యాత్ర చేపట్టారు. బోయింగ్ రూపొందించిన స్టార్‌లైనర్ క్యాప్సుల్ కాలిప్సోలో మరో ఆస్ట్రొనాట్ విల్మోర్‌తో కలిసి బుధవారం బయలుదేరిన ఆమె గురువారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరుకున్నారు. విలియమ్స్, విల్మోర్‌కు ఐఎస్ఎస్‌లోని వ్యోమగాములు స్వాగతం పలికారు. ఐఎస్ఎస్‌లో కాలుపెట్టిన వెంటనే సునీత సంబరంతో డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్‌లో భాగంగా బోయింగ్.. కాలిప్సో పేరిట స్టార్‌లైనర్ క్యాప్సుల్‌ను నిర్మించింది. కాలిప్సోతో తొలిసారిగా చేపట్టిన మానవసహిత అంతరిక్ష యాత్ర ఇది. బుధవారం ఫ్లోరిడాలో యూనైటెడ్ అలయెన్స్ అట్లాస్ ఫైవ్ రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. అయితే, గురువారం అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమయ్యే (డాకింగ్) క్రమంలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. క్యాప్సుల్‌లోని థ్రస్టర్లు మొరాయించడంతో డాకింగ్ గంట సేపు ఆలస్యమైంది. డాకింగ్ సమయంలో క్యాప్సుల్‌ను దశ దిశలను మార్చేందుకు థ్రస్టర్లు ఉపయోగపడతాయి. అయితే, హాట్ స్టార్ట్ విధానంలో థ్రస్టర్లు మళ్లీ ప్రారంభమయ్యేలా చేసిన విలియమ్స్, విల్మోర్ విజయవంతంగా డాకింగ్ పూర్తి చేశారు. 

బుధవారం ప్రయోగానికి ముందే క్యాప్సుల్‌లో ఓ చోట హీలియం గ్యాస్ లీకవుతున్నట్టు గుర్తించారు. దీంతో ఎటువంటి ప్రమాదం ఉండబోదని భావించిన ఇంజినీర్లు యథాతథంగా ప్రయోగాన్ని కొనసాగించారు. అంతరిక్ష యాత్ర సందర్భంగా మరో మూడు చోట్లు హీలియం వాయువు లీకవుతున్న విషయాన్ని గుర్తించారు. చివరకు థ్రస్టర్లలో కూడా లోపం తలెత్తింది. అయితే, అభివృద్ధి దశలో ఉన్న వ్యోమనౌకల్లో ఇలాంటి సమస్యలు సాధారణమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

కమర్షియల్ స్పేస్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా వ్యోమనౌకల అభివృద్ధి కోసం నాసా.. స్పేస్ ఎక్స్ తో పాటు బోయింగ్‌కు కాంట్రాక్ట్ ఇచ్చింది. స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ క్యాప్సుల్‌తో ఇప్పటికే పలు అంతరిక్ష యాత్రలు నిర్వహించారు. బోయింగ్‌కు చెందిన క్యాప్సుల్ కాలిప్సోతో ప్రయోగం ఇదే తొలిసారి. కాలిప్సోను పునర్వినియోగానికి అనువుగా రూపొందించారు. దీంతో, వరసుగా 15 మిషన్ల వరకూ చేపట్టవచ్చు.

  • Loading...

More Telugu News