Chandrababu: ఎంపీ అప్పలనాయుడుపై చంద్రబాబు ప్రశంసలు.. విమాన టికెట్‌పై ఆరా.. ఎంపీల భావోద్వేగం!
- కొత్తగా గెలిచిన ఎంపీలతో చంద్రబాబు సమావేశం
- విజయనగరం ఎంపీ అప్పలనాయుడును మెచ్చుకున్న చంద్రబాబు
- విమాన టికెట్‌పై అడిగి తెలుసుకున్న టీడీపీ అధినేత
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్తగా గెలిచిన ఎంపీలతో గురువారం భేటీ అయ్యారు. మొత్తం తొమ్మిది మంది ఎంపీలు ప్రత్యక్షంగా హాజరుకాగా.. మిగిలిన వారు జూమ్ ద్వారా మీటింగ్‌కు హాజరయ్యారు. ఈ భేటీలో ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ఒక సామాన్యమైన కార్యకర్తకు, చిన్న నేతలకు కూడా పార్టీలో పదవులు, అవకాశాలు కల్పించే విధంగా తన నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి, విధేయతతో ఉంటే పదవులు వస్తాయని.. దానికి విజయనగరం ఎంపీగా గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడే ఉదాహరణ అని పేర్కొన్నారు. అప్పల నాయుడుకు ఎంపీ టిక్కెట్ ఇస్తే చాలా మంది పెదవి విరిచారు. అయితే ఆయన కష్టపడి పనిచేసి.. అందరినీ కలుపుకుని ఎంపీగా విజయం సాధించారన్నారు. అప్పలనాయుడు ఆర్థికంగా బలవంతుడు కాదని.. అయితే పార్టీలో సామాన్య కార్యకర్తలకు టిక్కెట్లు వస్తాయి అనడానికి ఇదొక ఉదాహరణగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఎంపీలంతా శుక్రవారం ఉదయానికి ఢిల్లీ చేరుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ క్రమంలో 'అప్పల నాయుడూ విమాన టిక్కెట్ ఉందా.. తీసుకున్నావా' అని చంద్రబాబు అప్యాయంగా అడిగారు. 'ఒకవేళ లేకపోతే చెబితే మనవాళ్లు టిక్కెట్ బుక్ చేస్తారు' అని చంద్రబాబు చెప్పారు. సామాన్య కార్యకర్తలకు ఎంపీ టిక్కెట్ ఇచ్చిన తమ పార్టీ అధినేత.. ఆ కార్యకర్త స్థితిగతుల గురించి తెలుసుకుని విమాన టిక్కెట్‌పై కూడా ఆరా తీయడంపై ఎంపీలు భావోద్వేగానికి గురయ్యారు. మీటింగ్ నుంచి బయటకు వచ్చిన ఎంపీలు అధినేత తమపై చూపిన ప్రేమ పట్ల చర్చించుకుని ఆనందం వ్యక్తం చేశారు.