Anchor Shyamala: నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి: యాంకర్ శ్యామల

Anchor Shyamala said she has receiving threat calls

  • ఏపీ ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేసిన శ్యామల
  • బెదిరింపు కాల్స్ వస్తుండడంతో భయంగా ఉందన్న శ్యామల
  • తాను ఉన్నదే చెప్పానని, లేనిది ఎక్కడా చెప్పలేదని వెల్లడి
  • ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని స్పష్టీకరణ

ఇటీవల ఏపీ ఎన్నికల సందర్భంగా టాలీవుడ్ నటి, ప్రముఖ యాంకర్ శ్యామల పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత తరఫున ప్రచారం చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె జనసేనాని పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు జనసేన శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం కలిగించాయి. పిఠాపురంలో వంగా గీత విజయం పక్కా... పవన్ అరవడం, ఆయాసపడడం తప్ప ఇతరులకు సాయపడడం నేనెప్పుడూ చూడలేదు అంటూ శ్యామల చేసిన వ్యాఖ్యలతో పవన్ అభిమానులు, జనసైనికులు భగ్గుమన్నారు. 

ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి... పిఠాపురంలో పవన్ గెలవడమే కాదు, రాష్ట్రంలో జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో విజయాలు అందుకుంది. ఈ నేపథ్యంలో, యాంకర్ శ్యామల తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు. ఒకరకంగా భయంగానే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

"మీకు ఒకటి నచ్చుతుంది, నాకు మరొకటి నచ్చుతుంది... అలాగని మీకు నచ్చింది నాకు నచ్చాలని లేదు కదా... నాకు నచ్చిన దాని గురించి నేను చెప్పాను... మరి నువ్వు బతకడానికి వీల్లేదనడం అన్యాయం కదన్నా. దయచేసి ఏదీ వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శలు చేయలేదు. వ్యక్తిగత విమర్శలు ఎప్పటికీ చేయను కూడా. ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాను. 

ఒక పార్టీని గెలిపించడం కోసం నేను ఎంత కృషి చేయాలో అంతా చేశాను. ఉన్నదే చెప్పాను... లేనిది ఎక్కడా మాట్లాడలేదు. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను" అని శ్యామల పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియోలో మాట్లాడారు. 

"ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే. జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాను. ఈ ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు. ఆ తీర్పును గౌరవిస్తున్నాను. ముందుగా, ఘనవిజయం సాధించిన కూటమికి అభినందనలు. పెద్దలు నారా చంద్రబాబునాయుడు గారికి, పవన్ కల్యాణ్ గారికి, పురందేశ్వరి గారికి అందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వైసీపీ గెలవాలని కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, వారి కుటుంబాలకు పేరుపేరునా ధన్యవాదాలు. 

అవును... మేం ఓడిపోయాం. అయితే ఒక్కటి గుర్తుంచుకోవాలి. గెలిచిన నాడు ఎప్పుడూ విజయగర్వంతో విర్రవీగలేదు. ఓడిపోయిన నాడు కుంగిపోలేదు. ఈసారి మన జగన్ మోహన్ రెడ్డి గారు మరింత బలాన్ని పుంజుకుని తిరిగి వస్తారు. మనందరం ఆయన వెంట నడిచి, మంచి ప్రభుత్వాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేద్దాం. దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకు మంచి జరగాలని కోరుకుందాం. మేం ఎప్పటికీ జగనన్నతోనే. 

ఏదైనా గానీ... ప్రజలకు మంచి జరగడం ముఖ్యం. ఈ ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని వివరించారు.

  • Loading...

More Telugu News