Kalisetty Appalanaidu: చంద్రబాబు అంత కేర్ తీసుకుంటారని అనుకోలేదు... కళ్లలో నీళ్లు తిరిగాయి: ఎంపీ అప్పలనాయుడు
- నిన్న మంగళగిరిలో చంద్రబాబును కలిసిన టీడీపీ ఎంపీలు
- నేడు ఢిల్లీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
- ఎంపీలందరూ ఢిల్లీ రావాలన్న చంద్రబాబు
- అప్పల్నాయుడూ ఢిల్లీకి టికెట్ తీసుకున్నావా అంటూ ప్రత్యేకంగా అడిగిన చంద్రబాబు
- చంద్రబాబు ప్రేమతో కదిలిపోయిన విజయనగరం ఎంపీ అప్పలనాయుడు
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 16 ఎంపీ స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నిన్న మంగళగిరిలో టీడీపీ కొత్త ఎంపీలు పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. వారితో చంద్రబాబు మాట్లాడుతూ, శుక్రవారం నాడు ఢిల్లీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంటుందని అందరూ రావాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడి పట్ల ఆప్యాయంగా మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కలిశెట్టి అప్పలనాయుడి ఆర్థిక పరిస్థితి తెలిసిన చంద్రబాబు... ఏం అప్పలనాయుడూ... ఢిల్లీకి ఫ్లయిట్ టికెట్ తీసుకున్నావా... తీసుకోకపోతే మనవాళ్లు బుక్ చేస్తారులే అని చెప్పారు.
ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయిన చంద్రబాబు... తొలిసారిగా ఎంపీగా గెలిచిన తనతో మాట్లాడిన ఆ మాటలు కలిశెట్టి అప్పల్నాయుడ్ని తీవ్ర భావోద్వేగాలకు గురిచేశాయి.
తాజాగా ఢిల్లీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి వచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ... "ఇవాళ చెప్పలేనంత ఆనందం కలుగుతోంది. అదే సమయంలో బాధ్యతగా ఫీలవుతున్నాను. చంద్రబాబు ఎంపీ టికెట్ ఇచ్చి గౌరవించి, దగ్గరుండి గెలిపించారు.
చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రచారానికి వచ్చినప్పుడు కూడా అప్పల్నాయుడ్ని అందరూ చూసుకోండి, అప్పల్నాయుడ్ని గెలిపించాలి, ప్రచారం దగ్గరుండి చూసుకోండి అని ఇతర నాయకులకు చెప్పేవారు. సహజంగానే అభ్యర్థుల పట్ల పార్టీ అధినేతలు ఇలా జాగ్రత్తలు చెప్పడం మామూలే అని అనుకున్నాను. కానీ చంద్రబాబు ఎంత కేరింగ్ వ్యక్తో ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను. ఎంపీలందరూ ఉండగా, నన్నే చూపిస్తూ ఒకరకమైన ప్రేమాభిమానాలు ప్రదర్శించడం నన్ను తీవ్ర భావోద్వేగాలకు గురిచేసింది.
ఆయన నాపై చూపిన ఆదరణకు వెలకట్టలేను, మాటల్లో చెప్పలేను. అప్పలనాయుడు పెద్దగా ఎవరికీ తెలియని వ్యక్తి, గెలుస్తాడో లేదో అని కొందరు సందేహం వెలిబుచ్చినా, అప్పలనాయుడుకి టికెట్ ఇచ్చాను... అయితే అప్పలనాయుడు అందరినీ సమర్థంగా కలుపుకుని వెళ్లి, విజయం సాధించాడు అని నా గురించి చంద్రబాబు ఎంతో గొప్పగా చెప్పారు.
అంతేకాదు, ఒక తల్లి తన బిడ్డ పట్ల ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తుందో... చంద్రబాబు నా పట్ల అలాగే వ్యవహరించారు. చంద్రబాబు అలా మాట్లాడుతుంటే నాకు కన్నీళ్లు వచ్చేశాయి. ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని... అప్పలనాయుడూ ఢిల్లీకి టికెట్ తీసుకున్నావా... అని అడిగారు. అప్పలనాయుడికి కూడా టికెట్ తీసుకోండి అని నా పక్కన ఉన్న వ్యక్తికి సూచించారు.
ఆ సమయంలో అక్కడ చాలామంది నాయకులు ఉన్నారు... చంద్రబాబు మరోసారి అడిగి టికెట్ విషయం కన్ఫర్మ్ చేసుకున్నారు. నా కోసం ఒక పార్టీ అధినేత అంత శ్రద్ధ చూపించడం అనేది నేను ఏమాత్రం ఊహించలేదు. ఒకరకంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతుడ్ని. దేవుడు మరో జన్మ ఇస్తే టీడీపీ కోసమే పనిచేయాలి అనిపించింది. ఇలాంటి నాయకత్వంలో పనిచేయడం ఎంతో ఆనందం కలిగిస్తోంది.
చంద్రబాబు, లోకేశ్... ఒక కార్యకర్తకు టికెట్ ఇచ్చి గెలిపించాలని అనుకోవడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా, 2.49 లక్షల మెజారిటీతో గెలిపించారు. వాళ్లు ఏ ఆశయం కోసమైతే నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తున్నారో, ఆ ఆశయం కోసం, ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తాను" అని కలిశెట్టి వివరించారు.