JP Nadda: ఢిల్లీలో జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే నేతల కీలక సమావేశం
- ఈ నెల 12న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ
- క్యాబినెట్ కూర్పుపై ఎన్డీయే పెద్దల ఫోకస్
- మంత్రివర్గ ఎంపికల బాధ్యతను నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ లకు అప్పగించిన మోదీ
- ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతలతో మాట్లాడుతున్న జేపీ నడ్డా
- కేంద్ర క్యాబినెట్ లో టీడీపీ, జనసేన ప్రాతినిధ్యంపై ఈ రాత్రికి స్పష్టత!
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన నేపథ్యంలో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయడం లాంఛనమే. అయితే, నూతన క్యాబినెట్ లో ఎవరెవరు ఉంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గ ఎంపికల బాధ్యతలను మోదీ... నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లకు అప్పగించారు.
ఈ నేపథ్యంలో, మంత్రివర్గ కూర్పు, మిత్రపక్షాలకు ప్రాతినిధ్యం కల్పించడంపై చర్చించేందుకు ఢిల్లీలోని తన నివాసంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా కాసేపట్లో హాజరుకానున్నారు.
ఎన్డీయే భాగస్వామ్య పక్షాల డిమాండ్లపై జేపీ నడ్డా ఒక్కొక్కరితో చర్చిస్తున్నారు. కేంద్ర క్యాబినెట్ లో టీడీపీ, జనసేనల ప్రాతినిధ్యంపై ఈ రాత్రికి స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.