Imran Khan: భారత్‌లో కేజ్రీవాల్‌కు ప్రచారం కోసం బెయిల్ వచ్చింది... ఇక్కడ నేను అణచివేతకు గురవుతున్నాను: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
- ఓ కేసులో పాక్ సుప్రీం కోర్టు ముందు హాజరైన ఇమ్రాన్ ఖాన్
- ఈ సందర్భంగా కేజ్రీవాల్ బెయిల్‌ను ప్రస్తావించిన పాక్ మాజీ ప్రధాని
- జైల్లో తాను అణచివేతకు గురవుతున్నానని ఆవేదన
- పాక్ ఎన్నికలకు తనను దూరం పెట్టేందుకు ఐదు రోజుల్లోనే దోషిగా తేల్చారని ఆవేదన
భారత్‌లో ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చిందని... తాను మాత్రం ఇక్కడ అప్రకటిత మార్షల్ లా కింద అణచివేతను ఎదుర్కొంటున్నానని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఓ కేసులో ఆయన పాక్ సుప్రీంకోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు బెయిల్ రావడాన్ని ప్రస్తావించారు. తాను జైల్లో అణచివేతకు గురవుతున్నానని... తన పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
2022లో అధికారం కోల్పోయినప్పటి నుంచి తనకు ఎదురైన పరిస్థితులను ఆయన కోర్టుకు ఏకరవు పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పాక్ సార్వత్రిక ఎన్నికలకు తనను దూరం పెట్టడానికి ఐదు రోజుల్లోనే తనను ఓ కేసులో దోషిగా తేల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ భారత్‌లో మాత్రం కేజ్రీవాల్ కు ప్రచారానికి బెయిల్ వచ్చిందన్నారు.