Elon Musk: మూడోసారి ప్రధానిగా మోదీ.. ఎలాన్ మస్క్ అభినందనలు
- సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం
- ప్రధాని మోదీకి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అభినందనలు
- తమ కంపెనీలు భారత్‌లో కార్యకలాపాలు మొదలెట్టేందుకు ఉత్సుకతతో ఉన్నాయని వ్యాఖ్య
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే రథసారథి నరేంద్ర మోదీకి టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అతి పెద్ద ప్రజాస్వామిక ఎన్నికల్లో విజయం సాధించిన నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు. మా సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఉత్సుకతతో ఉన్నాయి’’ అని ఆయన పోస్టు పెట్టారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోదీని కాబోయే ప్రధానిగా గుర్తించిన విషయం తెలిసిందే. వరుసగా మూడోసారి ఆయన భారత ప్రధాని కాబోతున్నారు. ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోదీ నాయకత్వంలో ఎన్డీయే ఈ ఎన్నికల్లో 543 సీట్లకు గాను 293 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించింది.
కాగా, ఎన్నికలకు ముందే ఎలాన్ మస్క్ భారత పర్యటన ఖరారైనా చివరి నిమిషంలో వాయిదా పడింది. టెస్లాకు సంబంధించిన పనుల్లో మస్క్ తీరిక లేకుండా ఉండటంతో పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. గతేడాది ప్రధాని మోదీ, మస్క్ అమెరికాలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీపై టెస్లా అధినేత ప్రశంసలు కురిపించారు. తాను మోదీ ఫ్యాన్ నని అన్నారు. త్వరలో భారత్ లో టెస్లా పెట్టుబడులు పెడుతుందని కూడా పేర్కొన్నారు. ‘‘ఆయనకు భారత్‌పై ఎంతో శ్రద్ధ. అక్కడ పెట్టుబడులు పెట్టాలని మాతో పదే పదే చెప్పారు. మేము కూడా ఈ దిశగా యోచన చేస్తున్నాం. త్వరలోనే భారత్ టెస్లా కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నా’’ అని ఎలాన్ మస్క్ అప్పట్లో అన్నారు.