RRR: సమాధి ఎక్కడుండాలో రామోజీరావు ముందే నిర్ణయించారు: రఘురామకృష్ణరాజు
- రామోజీరావు మృతి పట్ల ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సంతాపం
- 'ఎక్స్' వేదికగా ప్రత్యేక వీడియో విడుదల చేసిన టీడీపీ నేత
- వీడియోలో రామోజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న వైనం
- ఆర్ఎఫ్సీలోని ఓ ప్లేస్‌ని తన సమాధి కోసం రామోజీ ఎంపిక చేశారని వెల్లడి
- దాన్ని ఓ ఉద్యానవనంలా తీర్చిదిద్దారన్న ఆర్ఆర్ఆర్
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడలోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. ఇక రామోజీ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఫిల్మ్‌సిటీలో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక ఆయన మృతిపట్ల టీడీపీ నేత, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. వీడియోలో రామోజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే తన సమాధి ఎక్కడ ఉండాలో రామోజీరావు ముందే నిర్ణయించారని ఆర్ఆర్ఆర్ తెలియజేశారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
"ఉదయం లేవగానే రామోజీరావు చనిపోయారనే వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. కొన్ని నెలల క్రితం ఆయనతో రెండు గంటల పాటు మాట్లాడాను. నా జీవితంలో ఆ సమయం మరిచిపోలేనిది. తన సమాధి ఎక్కడ ఉండాలో కొన్నేళ్ల ముందే నిర్ణయించారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఓ ప్లేస్‌ని ఎంపిక చేశారు. దాన్ని ఓ ఉద్యానవనంలా తీర్చిదిద్దారు" అని రఘురామకృష్ణరాజు వీడియోలో చెప్పుకొచ్చారు.