JDU: జేడీయూ నుంచి ఇద్దరికి ఎన్డీయే క్యాబినెట్ బెర్తులు!
- రేపు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ
- కేంద్ర మంత్రి వర్గ జాబితాను రాష్ట్రపతికి సమర్పించనున్న వైనం
- జేడీయూ ఎంపీలు లలన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్ లకు మంత్రి పదవులు!
మూడో పర్యాయం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రేపు ప్రమాణస్వీకారం చేయనుండగా, క్యాబినెట్ కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంత్రివర్గ సహచరుల జాబితాను మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించాల్సి ఉంది. నిన్న జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్, చంద్రబాబు, నితీశ్ కుమార్ వంటి ఎన్డీయే పెద్దలు కేంద్ర క్యాబినెట్ కూర్పుపై చర్చించారు.
ఈ నేపథ్యంలో కొంత కీలక సమాచారం బయటికి వచ్చింది. నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూ నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు ఖరారైనట్టు తెలుస్తోంది. జేడీయూ ఎంపీలు లలన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్ లకు మోదీ క్యాబినెట్ లో చోటు లభించిందంటూ జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ఎన్నికల్లో బీజేపీకి 240 స్థానాలు రాగా, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు టీడీపీ 16, జేడీయూ 14 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోవడంతో మిత్రపక్షాల మద్దతు కీలకంగా మారింది. అందుకే, రెండంకెల్లో ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ, జేడీయూలకు మోదీ 3.0 క్యాబినెట్లో సముచిత స్థానం లభించే అవకాశాలున్నాయి.