Narendra Modi: రేపే ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం... రాష్ట్రపతి భవన్ లో భారీగా ఏర్పాట్లు
- వరుసగా మూడో పర్యాయం భారత ప్రధానిగా నరేంద్ర మోదీ
- రేపు రాత్రి 7.15 గంటలకు ప్రమాణస్వీకారం
- వేదికగా నిలవనున్న రాష్ట్రపతి భవన్
- దాదాపు 8 వేల మంది అతిథుల రాక!
వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ అందుకు వేదికగా నిలవనుంది. రేపు రాత్రి 7.15 గంటలకు మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి దాదాపు 8 వేల మంది అతిథులు హాజరవుతారని అంచనా. ఎన్డీయే కూటమి నేతలు, విపక్ష నేతలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రానున్నారు.
శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మారిషస్ తదితర దేశాల అధినేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. 2014లో మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి సార్క్ దేశాల అధినేతలు హాజరయ్యారు. 2019లో ప్రమాణ స్వీకార వేడుకకు బిమ్స్ టెక్ కూటమి దేశాల అధినేతలు పాల్గొన్నారు.
కాగా, ఈసారి మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సెంట్రల్ విస్టా సముదాయం నిర్మాణ కార్మికులు, వందే భారత్ ప్రాజెక్టులో పనిచేసిన సిబ్బందికి, వికసిత్ భారత్ పథకాల అంబాసిడర్లకు కూడా ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తోంది.
అటు, రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ వంటి పారా మిలిటరీ బలగాలు, ఎన్ఎస్ జీ కమాండోలు, స్నైపర్లు, డ్రోన్ పహారాతో భద్రత కల్పిస్తున్నారు.
రాష్ట్రపతి భవన్ లోపల, బయట మూడంచెల భద్రతను అమలు చేస్తున్నారు. తనిఖీల నిమిత్తం ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. రేపు ఉదయం నుంచి రాష్ట్రపతి భవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.