Amaravati: అమరావతిలో కొత్త కళ.. రాజధాని నిర్మాణం పనులు పునఃప్రారంభం
- రకరకాల పిచ్చి మొక్కలతో నిండిపోయిన అమరావతి ప్రాంతం
- యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టిన అధికారులు
- సీడ్ యాక్సెస్, ప్రధాన రోడ్ల వెంబడి పనులు
- త్వరితగతిన పనులు చేయిస్తున్న సీఆర్డీఏ అధికారులు
ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో మళ్లీ సందడి మొదలైంది. దట్టమైన ముళ్లకంపలు, పిచ్చి చెట్లు, పొదలతో చిట్టడవిలా మారిన అమరావతిలో సీఆర్డీఏ అధికారులు జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నారు. రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభమైన నేపథ్యంలో భారీ సంఖ్యలో పొక్లెయిన్లు, జేసీబీలను రప్పించి ఎక్కడిక్కడ మళ్లీ కంపలను తొలగించి శుభ్రం చేస్తున్నారు. ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల బహుళ అంతస్తుల భవనాలు, జ్యుడిషియల్ క్వార్టర్స్, ప్రభుత్వ టైప్ - 1, టైప్- 2 భవనాలు, శాశ్వత రాజధాని నిర్మాణ పనులలో భాగమైన జీఏడీ మెగా టవర్లు అన్నీ పిచ్చి చెట్లతో కమ్మేసుకున్నాయి.
12న చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నారు. విజయవాడ నుంచి అమరావతిలోకి ప్రవేశించే కరకట్ట రోడ్డు, అత్యంత ప్రధానమైన సీడ్ యాక్సెస్ రోడ్డు, హైకోర్టు నుంచి తూళ్లూరుకు వెళ్లే రోడ్డు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా నిర్మించిన రోడ్లు, ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల బహుళ అంతస్తుల భవనాల సమీపంలో భారీగా విస్తరించిన ముళ్లకంపలను తొలగించే కార్యక్రమాన్ని సీఆర్డీఏ చేపట్టింది. శాశ్వత రాజధాని నిర్మాణ పనులలో భాగంగా నిర్మిస్తున్న గ్యాడ్ టవర్లు చెరువులను తలపించేలా ఉండటంతో వాటిల్లోని నీటిని తోడేందుకు మోటార్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే, అమరావతిలోని పిచ్చి చెట్లను తొలగించేందుకు వారం పడుతుందని సమాచారం.
దుమ్ముధూళితో నిండిపోయిన ఎక్స్పీరియన్స్ సెంటర్ తాళాలు తెరిచి బూజు దులుపుతున్నారు. ఈ సెంటర్ నలువైపులా విస్తరించి ఉన్న పొదలను తొలగిస్తున్నారు. రాజధానిలో విద్యుత్ తీగలను భూగర్భంలో ఏర్పాటు చేసిన నిర్మాణాలు ఎక్కడ ఉన్నాయో తెలియనంతగా పిచ్చి చెట్లు విస్తరించాయి. వాటిని తొలగించి అన్నీ బయటకు కనిపించేలా చేస్తున్నారు. ఉద్దండ్రాయునిపాలెంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నారు. సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం నుంచి ఈ పనులు జరగనున్నాయి.