Ramoji Rao: తన స్మారకం విషయంలోనూ రామోజీ ముందుచూపు.. నేడు అక్కడే అంత్యక్రియలు
- తన స్మారకాన్ని ముందే నిర్మించుకున్న రామోజీరావు
- నేడు అధికారిక లాంఛనాలతో అక్కడే అంత్యక్రియలు
- ఏర్పాటు పూర్తిచేసిన ప్రభుత్వ యంత్రాంగం
- ప్రముఖులు రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ముందుచూపు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయన చేపట్టే ప్రతి పనిలోనూ భవిష్యత్తును చూసేవారు. అదే ఆయనను ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టింది. చివరికి ఆయన తన స్మారకాన్ని కూడా ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిలింసిటీలోని ఓ ప్రాంతంలో తన స్మృతి కట్టడాన్ని ఆయనే నిర్మించుకున్నారు. ఇప్పుడు అక్కడే రామోజీ అంత్యక్రియలు జరగనున్నాయి.
రామోజీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అక్కడి నుంచే ఈ మేరకు సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు జారీచేశారు. రామోజీ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు.
రామోజీ ఫిలింసిటీలోని స్మృతివనం వద్ద నేడు నిర్వహించనున్న అంత్యక్రియల ఏర్పాట్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె.శశాంక, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ తదితరులు పరిశీలించారు. పలువురు ముఖ్యమంత్రులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.