G. Kishan Reddy: తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలకు కేంద్ర కేబినెట్ బెర్తులు ఖరారు!
- కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఫోన్ కాల్స్ వచ్చాయంటున్న పార్టీ వర్గాలు
- నేడు రాత్రి 7.15 గంటలకు కొలువు తీరనున్న మోదీ 3.0 సర్కారు
- కేబినెట్ బెర్తులు దక్కించుకోబోయే ఎంపీలపై ఉత్కంఠ
తెలంగాణ బీజేపీ ఎంపీలలో ఈసారి ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయనే ఉత్కంఠకు తెరపడినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ ఎంపీ జీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లకు కేబినెట్ బెర్తులు దక్కనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇరువురికీ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవలే వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తెలంగాణలో 8 ఎంపీ సీట్లను గెలుచుకుంది. దీంతో మంత్రి పదవులు ఎవరెవరికి దక్కనున్నాయనే ఆసక్తికర చర్చ జరిగింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు డీకే అరుణ, ఈటల రాజేందర్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే.
కాగా మరికొన్ని గంటల్లోనే ‘మోదీ 3.0’ ప్రభుత్వం కొలువు తీరనుంది. రాష్ట్రపతి భవన్లో రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నరేంద్ర మోదీ పట్టాభిషేకం జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో కేబినెట్ మంత్రి పదవులు దక్కించుకోనున్న ఎంపీలు ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది.