India vs Pakistan: పాకిస్థాన్‌పై భారత్ సంచలన విజయంతో బద్దలైన పలు రికార్డులు.. జాబితా ఇదిగో
- పాక్‌పై 7 గెలుపులతో టీ20 వరల్డ్ కప్‌లలో ఒక ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ రికార్డు
- పాక్‌పై స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా నిలిచిన టీమిండియా
- 120 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకొని పలు రికార్డులు సృష్టించిన భారత్
ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్థాన్‌పై టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. విజయాల పరంపర మరోసారి పునరావృతమైంది. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసి 119 పరుగులకే ఆలౌట్ అయిన రోహిత్ సేన.. ఆ తర్వాత బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసి గెలుపును సొంతం చేసుకుంది. దీంతో టీమిండియా టీ20 వరల్డ్ కప్‌లో పలు రికార్డులను నెలకొల్పింది.
టీ20 వరల్డ్ కప్‌లో ఒక ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు..
టీ20 వరల్డ్ కప్‌లలో ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. తాజా గెలుపుతో కలుపుకొని పాకిస్థాన్‌పై భారత్ ఇప్పటివరకు ఏకంగా 7 సార్లు గెలిచింది. ఒక టై మ్యాచ్ విజయంతో కలుపుకొని ఈ రికార్డును భారత్ సొంతం చేసుకుంది. ఈ జాబితాలో పాకిస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. టీ20 వరల్డ్ కప్‌లలో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ 6 విజయాలు సాధించింది. శ్రీలంక కూడా వెస్టిండీస్‌పై 6 విజయాలు సాధించి సమాన స్థితిలో నిలిచింది.
పాక్‌పై స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా భారత్..
మరోవైపు పాకిస్థాన్‌పై అత్యల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా భారత్ నిలిచింది. 2021లో పాక్‌పై జింబాబ్వే 119 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోగా తిరిగి భారత్ ఇప్పుడు అదే స్కోరును అద్భుతంగా డిఫెండ్ చేసుకోగలిగింది. ఇక 2010లో పాక్‌పై 128 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా విజయవంతంగా కాపాడుకుంది. ఆ తర్వాత ఇంగ్లండ్ 130, జింబాబ్వే 131 పరుగుల లక్ష్యాలను డిఫెండ్ చేసుకున్నాయి.
టీ20 వరల్డ్ కప్‌లలో డిఫెండ్ చేసుకున్న అత్యల్ప లక్ష్యాలు..
1. న్యూజిలాండ్‌పై 120 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్న శ్రీలంక (2014)
2. పాకిస్థాన్‌పై 120 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకున్న భారత్ (2024)
3. వెస్టిండీస్‌పై 124 పరుగుల టార్గెట్‌ను కాపాడుకున్న ఆఫ్ఘనిస్థాన్ (2016)
4. ఇండియాపై 127 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకున్న న్యూజిలాండ్ (2016)
5. న్యూజిలాండ్‌పై 129 పరుగుల టార్గెట్‌ను కాపాడుకున్న దక్షిణాఫ్రికా (2009)
టీ20లో భారత్ కాపాడుకున్న అత్యల్ప లక్ష్యాలు..
1. పాకిస్థాన్‌పై 120 పరుగుల టార్గెట్ (2024)
2. జింబాబ్వేపై 139 పరుగుల లక్ష్యం (2016)
3. ఇంగ్లండ్‌పై 145 పరుగుల లక్ష్యం (2017)
4. బంగ్లాదేశ్‌పై 147 పరుగుల టార్గెట్ (2016).