India vs Pakistan: ట్రాక్టర్ అమ్మేసి భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చూడడానికి వెళ్లిన పాక్ అభిమాని!
- 3000 డాలర్లకు ట్రాక్టర్ అమ్మేసి మ్యాచ్ టికెట్ కొన్న అభిమాని
- పాకిస్థాన్ మ్యాచ్ ఓడిపోవడంతో నిరాశకు గురవుతున్న ఫ్యాన్
- భారత్ స్కోరు చూసి పాక్ గెలవడం పక్కా అనుకున్నానని వాపోయిన పాక్ అభిమాని
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ ఎప్పటి మాదిరిగానే క్రికెట్ ప్రేమికులకు అసలు సిసలైన మజాను అందించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత ఆటగాళ్లు, ఫ్యాన్స్, మద్దతుదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే మరోవైపు పాక్ ఆటగాళ్లు, ఆ జట్టు ఫ్యాన్స్ తీవ్ర విచారంలో మునిగిపోయారు. పాక్ డ్రెసింగ్‌లో అందరూ భారమైన హృదయాలతో కనిపించారు. 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడడంతో పాకిస్థాన్ అభిమానులు నిరాశకు గురయ్యారు.
ఓటమి బాధకు గురవుతున్న పాకిస్థానీ క్రికెట్ ఫ్యాన్స్‌లో ఓ అభిమాని గురించి కాస్త ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే.. సదరు పాక్ అభిమాని ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏకంగా తన ట్రాక్టర్‌ను అమ్మేశాడు. ట్రాక్టర్‌ను అమ్మగా వచ్చిన 3000 డాలర్లతో మ్యాచ్ టికెట్ కొనుగోలు చేశాడు. అనుకున్నట్టుగానే న్యూయార్క్ వెళ్లి నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షించాడు. కానీ పాకిస్థాన్ ఓడిపోవడంతో అతడు తీవ్ర నిరాశలో మునిగిపోయాడు.
పాకిస్థాన్ ఫ్యాన్
ట్రాక్టర్ అమ్ముకొని మరీ అమెరికా వెళ్లి మ్యాచ్ చూస్తే కనీసం గెలుపు సంతోషమైనా దక్కలేదని అతడు బాధపడుతున్నాడు. ‘‘ నేను 3,000 డాలర్లతో టిక్కెట్ కొనేందుకు నా ట్రాక్టర్‌ను అమ్ముకున్నాను. భారత్ చేసిన 119 పరుగుల స్కోర్ చూశాక పాకిస్థాన్ ఓడిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. మ్యాచ్ మా చేతుల్లోనే ఉందనుకున్నాను. కానీ బాబర్ ఆజం ఔట్ అయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. నేను తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాను. భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని అన్నాడు. కాగా పాక్‌పై టీమిండియా గెలుపును భారత ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. వీధిల్లోకి చేరి బాణసంచా కాల్చారు.
కాగా టీ20 వరల్డ్ కప్‌లలో భారత్‌పై గెలవాలనే పాకిస్థాన్ ఆశలు మరోసారి గల్లంతు అయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 119 పరుగులకు ఆలౌట్ అవగా.. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 113 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 6 పరుగుల తేడాతో గెలిచింది.