King Fisher Beers: ఏపీలో మళ్లీ అడుగుపెట్టిన ‘కింగ్ ఫిషర్’.. మద్యం ప్రియుల సంబరాలు.. వీడియో ఇదిగో!
- ఐదేళ్లుగా బ్రాండెడ్ మద్యానికి దూరమైన ఏపీ ప్రజలు
- నాణ్యమైన మద్యం కోసం మద్యం ప్రియుల ఎదురుచూపులు
- మరికొన్ని బ్రాండ్లు కూడా కావాలంటూ నెటిజన్ల లిస్ట్
- త్వరలోనే అవి కూడా అందుబాటులోకి వచ్చేస్తాయంటూ ఆనం రిప్లై
ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం ప్రియులకు ఇది బ్రహ్మాండమైన శుభవార్తే. గత ఐదేళ్లుగా బ్రాండెడ్ మద్యం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన వారి ఆశలు ఫలించాయి. ప్రభుత్వం మారడంతో బ్రాండెడ్ మద్యం మళ్లీ దిగుమతి అవుతోంది. కొత్త స్టాక్‌తో మద్యం దుకాణాలు కళకళలాడుతున్నాయి. తాజాగా కింగ్‌ఫిషర్ బీర్లు గొడౌన్లకు చేరుకున్నాయి.
గోదాములలోకి లారీల నుంచి బీర్లను అన్లోడ్ చేస్తున్న వీడియోను టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఏపీ నుంచి మాయమైపోయిన బీర్లు మళ్లీ వచ్చాయని ఆయన దానికి క్యాప్షన్ తగిలించారు.
ఈ వీడియోపై నెటిజన్లు సంతోషం వ్యక్తంచేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కింగ్‌ఫిషర్ ఒక్కటే కాదని, పలానా బ్రాండ్లు కావాలంటూ వాటి లిస్ట్ కూడా పెడుతున్నారు. దీనికి స్పందించిన ఆనం.. త్వరలోనే అన్ని మద్యం బ్రాండ్లు దొరుకుతాయని పేర్కొన్నారు. మరోవైపు, ఇష్టమైన మద్యం మళ్లీ అందుబాటులోకి వస్తుండడంతో నెటిజన్లు మీమ్స్‌తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.