Haryana: హర్యానాలో గెలిచిందే ఐదుగురు.. అందులో ముగ్గురికి మంత్రి పదవులు
- త్వరలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడమే కారణం
- నవంబర్ నెలాఖరుతో ముగుస్తున్న అసెంబ్లీ గడువు
- హర్యానాతో పాటు మహారాష్ట్రలోనూ అక్టోబర్ లో ఎన్నికలు
ఎన్డీయే నేతృత్వంలో కేంద్రంలో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వంలో హర్యానాకు విశేష ప్రాధాన్యం లభించింది. ఆ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి తరఫున గెలుపొందిన సభ్యులు ఐదుగురే.. అయితే, అందులో ముగ్గురిని కేంద్ర మంత్రి పదవి వరించింది. హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తో పాటు రావు ఇంద్రజిత్ సింగ్, క్రిష్ణన్ పాల్ గుజ్జర్ లకు మోదీ 3.0 కేబినెట్ లో చోటు దక్కింది. లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన ఐదుగురు ఎంపీలలో ముగ్గురు కేంద్ర మంత్రులుగా ఆదివారం సాయంత్రం ప్రమాణం చేశారు.
హర్యానాకు కేంద్ర కేబినెట్ లో ప్రాధాన్యం దక్కడానికి కారణం ఆ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే నవంబర్ లో హర్యానా ప్రభుత్వ గడువు ముగియనుంది. అక్టోబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో హర్యానాలో అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే బీజేపీ పెద్దలు కేంద్ర కేబినెట్ లో ఆ రాష్ట్ర నేతలకు ప్రాధాన్యమిచ్చారని తెలుస్తోంది. హర్యానాలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలు, 10 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. కాగా, హర్యానాతో పాటు అక్టోబర్ లో మహారాష్ట్రలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.