Somnath Bharti: గుండు కొట్టించుకుంటానన్న శపథంపై వెనక్కి తగ్గిన ఆప్ నేత సోమ్‌నాథ్ భారతి
- మోదీ మళ్లీ ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటానని సోమ్‌నాథ్ భారతి శపథం
- తాను ఇప్పటికీ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టీకరణ
- మోదీ సొంతంగా అధికారంలోకి రాలేదని ఎద్దేవా
- మిత్ర పక్షాల మద్దతుతోనే ప్రధాని అయ్యారన్న ఆప్ నేత
- సొంతంగా అయి ఉంటే గుండు కొట్టించుకునే వాడినని వ్యాఖ్య
బీజేపీ మళ్లీ గెలిచి నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటానని శపథం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సోమ్‌నాథ్ భారతి యూటర్న్ తీసుకున్నారు. మోదీ ప్రధాని అయినా ఆయన సొంతంగా పీఠాన్ని అధిష్ఠించలేకపోయారని, సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన ప్రధాని అయ్యారని చెబుతూ తాను గుండు కొట్టించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
‘‘మోదీ ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటానని నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. అయితే, ఈసారి ఆయన సొంతంగా ఆ ఘనత సాధించలేకపోయారు. మిత్ర పక్షాల మద్దతుతో ఆయన ప్రధాని అయ్యారు. నేను ఇప్పటికీ నా మాటపై నిలబడే ఉన్నా. ఆయన (మోదీ) సొంతంగా విజయం సాధించలేదు కాబట్టి, అది ఆయన విజయం కానేకాదు. కాబట్టి నేను గుండు గీయించుకోబోను’’ అని వివరించారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి (ఇండియా) విజయం సాధించి అధికారంలోకి వస్తుందని సోమ్‌నాథ్ భారతి గతంలో ధీమా వ్యక్తం చేశారు. మోదీ కనుక మరోమారు ప్రధాని అయితే గుండు గీయించుకుంటానని శపథం చేశారు.