Stock Market: స్టాక్ మార్కెట్లో మూడు రోజుల వరుస లాభాలకు నేడు బ్రేక్
- కేంద్రంలో ఎన్డీయే హ్యాట్రిక్ తో మూడ్రోజుల పాటు స్టాక్ మార్కెట్లకు లాభాలు
- నేడు అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో మందగించిన లావాదేవీలు
- స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
కేంద్రంలో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో, భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడు రోజుల పాటు జోరు ప్రదర్శించాయి. ఈ ఊపుకు నేడు తెరపడింది. దేశ రాజకీయ పరిణామాలు అందించిన ఉత్సాహంతో మూడ్రోజుల పాటు లాభాల్లో పయనించిన స్టాక్ మార్కెట్ సూచీలు నేడు అంతర్జాతీయ పరిణామాలతో ప్రభావితం అయ్యాయి.
బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ స్వల్ప నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 203 పాయింట్ల నష్టంతో 76,490.08 వద్ద ముగియగా... నిఫ్టీ 30.95 పాయింట్ల నష్టంతో 23,259.20 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభంలో 77,079.04 వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకింది. ట్రేడింగ్ కొనసాగే కొద్దీ లావాదేవీలు మందగించాయి.
ఇవాళ్టి ట్రేడింగ్ లో అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్ లాభాలు ఆర్జించగా... టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్ షేర్లు పతనమయ్యాయి.