Chirag Paswan: నాడు జంటగా నటించిన హీరోహీరోయిన్లు.. నేడు ఎంపీలుగా పార్లమెంట్ లో కలుసుకున్నారు

Bollywood Actress Kangana Ranaut And Politician Chirag Paswan Met In Lok Sabha
  • ఓ సినిమాలో నటించిన చిరాగ్ పాశ్వాన్, కంగన
  • 2011లో విడుదలైన ‘మిలే న మిలే హమ్’ తో చిరాగ్ ఎంట్రీ
  • బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన సినిమా
ఒకప్పుడు సినిమాలో జంటగా రొమాన్స్ చేసిన జంట ఇప్పుడు పార్లమెంట్ లో ఎంపీలుగా కలుసుకున్నారు. అందులో ఒకరు తొలిసారిగా సభలో అడుగుపెట్టగా.. మరొకరు మాత్రం మూడోసారి ఎన్నికవడమే కాదు, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. ఆ జంటే చిరాగ్ పాశ్వాన్, కంగనా రనౌత్. లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో హీరోగా చేశారు. 2011లో ‘మిలే న మిలే హమ్’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

అప్పటికే నాలుగైదు సినిమాల్లో నటించిన కంగనా రనౌత్ అందులో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలోని పాటల్లో చిరాగ్, కంగనా రొమాన్స్ చేశారు. అయితే, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ పరాజయంతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన చిరాగ్.. తండ్రికి మద్దతుగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014లో ఎంపీ అయి పూర్తి స్థాయి రాజ‌కీయాల్లో బిజీ అయ్యారు. రాంవిలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఎల్జేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా లోక్ సభ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టిన చిరాగ్ ను ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

మిలే న మిలే హమ్ సినిమా తర్వాత తను వెడ్స్ మను సినిమాలో హీరోయిన్ గా నటించిన కంగన.. స్టార్ గా ఎదిగి జాతీయ అవార్డులను గెలుచుకుంది. వరుస సినిమాలతో బాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్ గా మారింది. ఇటీవల బీజేపీలో చేరిన కంగనాను పార్టీ అధిష్ఠానం హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. ఇక్కడ ఘన విజయం సాధించిన కంగన లోక్ సభలో అడుగుపెట్టింది.

తాజాగా ఎన్డీయే కూటమి ఎంపీల మీటింగ్ లో చిరాగ్, కంగన కలుసుకున్నారు. చాలాకాలం తర్వాత కలుసుకున్న ఈ మాజీ హీరోహీరోయిన్లు ఆప్యాయంగా పలకరించుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Chirag Paswan
Kangana Ranaut
Met In Lok Sabha
Mile na Mile Hum
Movie

More Telugu News