Narendra Modi: 'మోదీ కా పరివార్' బలాన్నిచ్చింది... ఇక ఆ నినాదాన్ని తొలగించండి: ప్రధాని మోదీ
- ఎన్నికల సమయంలో మార్మోగిన మోదీ కా పరివార్ నినాదం
- మోదీకి కుటుంబం లేదని లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శ
- దేశమే తన కుటుంబమని ప్రధాని మోదీ కౌంటర్
- మోదీ కా పరివార్ అని ఎక్స్ వేదికగా యాడ్ చేసుకున్న అగ్రనేతలు
సార్వత్రిక ఎన్నికల సమయంలో 'మోదీ కా పరివార్' సోషల్ మీడియా నినాదం మనమంతా ఒక్కటేనని సమర్థవంతంగా చాటి చెప్పిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇక, ఇప్పుడు దీనిని తొలగించాల్సిందిగా ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ నినాదం ఎన్నికల సమయంలో బలాన్ని ఇచ్చిందన్నారు. ప్రజలు వరుసగా మూడోసారి ఎన్డీయేకు మెజార్టీ ఇచ్చారని పేర్కొన్నారు. తద్వారా నిరంతరం దేశ అభివృద్ధి కోసం పని చేయాలని తమను ఆదేశించారన్నారు.
మనమంతా ఒకే కుటుంబమనే సందేశాన్ని ఇచ్చిన ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని... ఇప్పుడు ఆ నినాదాన్ని తొలగించాలని కోరారు. దీంతో డిస్ప్లే మారవచ్చును కానీ దేశ పురోగతి కోసం పరిశ్రమిస్తోన్న కుటుంబంగా మన బంధం మాత్రం బలంగా... అలాగే ఉంటుందన్నారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో మోదీకి కుటుంబం లేదని బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శించారు. దీనికి మోదీ కౌంటర్ ఇచ్చారు. ఈ దేశమే నా కుటుంబమని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ ముఖ్య నాయకులు సహా ఎంతోమంది మోదీ కా పరివార్ అనే నినాదాన్ని ఎక్స్ ఖాతాలో తమ పేరు పక్కన యాడ్ చేసుకున్నారు.