YS Jagan: ఎన్నికల ఫలితాలపై వైసీపీ అభ్యర్థుల వద్ద మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- పోలింగ్‌కు ముందు, తర్వాత సర్వేల్లో ఎక్కడా వ్యతిరేకత రాలేదన్న వైసీపీ అధినేత
- ఫలితాలు మాత్రం వేరుగా వచ్చాయని వ్యాఖ్య
- 17 లక్షల శాంపుల్స్ తీసుకున్నామన్న జగన్
- పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో క్యాంపు కార్యాలయంలో మంగళవారం భేటీ
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు ఎక్కడా ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించలేదని, కానీ ఫలితాలు మాత్రం విభిన్నంగా వచ్చాయని వ్యాఖ్యానించారు. పోలింగ్‌కు ముందు, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించామని, 17 లక్షల శాంపిల్స్ తీసుకున్నామని వెల్లడించారు. వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులను మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో జగన్ కలిశారు. ఎన్నికల ఫలితాలపై వారితో చర్చించిన సందర్భంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
నష్టపోయిన కార్యకర్తలను పరామర్శిస్తా..
వైసీసీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మరింత ఇబ్బంది పెడతారని కూడా పేర్కొన్నారు. నష్టపోయిన కార్యకర్తలను తాను పరామర్శిస్తానని, భరోసా ఇస్తానని పార్టీ నాయకులకు జగన్ వెల్లడించారు. కార్యకర్తలపై దాడులను అంతా కలిసి ఎదుర్కోవాలని, జిల్లా స్థాయిలో టీమ్‌గా నిలవాలని, కార్యకర్తలకు అండగా ఉండి ఆదుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక ఎన్నికల్లో పార్టీకి 40 శాతం ఓటింగ్ వచ్చిందని, పార్టీ నేతలంతా ప్రజల మధ్యనే ఉండాలని జగన్ సూచించారు.
జగన్‌ను కలిసిన నేతలు వీరే..
మంగళవారం జగన్ క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను కలిసిన వారిలో పలువురు సీనియర్లు ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, మజ్జి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి, గంగుల ప్రభాకరరెడ్డి, ఇంతియాజ్, బిజేంద్రారెడ్డి, జక్కంపూడి రాజా, అన్నా రాంబాబు, రాపాక వరప్రసాద్, తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణితో పాటు పలువురు ఉన్నారు. సమావేశానికి వచ్చిన పలువురు తమ అభిప్రాయాలను జగన్ వద్ద వెల్లడించారు. ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ... చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చగలని అన్నారు. వైసీపీ హయాంలో అమలు చేసిన పథకాలకు నిధులను ఇవ్వడానికే తాము ఇబ్బంది పడ్డామని, అంతకుమించిన పథకాలను ప్రకటించిన చంద్రబాబు ఎలా ఇవ్వగలరని ఆయన సందేహం వ్యక్తం చేశారు.