Chandrababu: చంద్రబాబు అనే నేను... ముఖ్యమంత్రిగా 4వ సారి ప్రమాణస్వీకారం చేసిన టీడీపీ చీఫ్
- ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
- చంద్రబాబుతో ప్రమాణం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- అనంతరం చంద్రబాబును హత్తుకుని అభినందించిన ప్రధాని మోదీ
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్... చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే... అంటూ బాబు ప్రమాణం కొనసాగింది.
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా... రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికి న్యాయం చేకూర్చుతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ ప్రమాణం ఆచరించారు.
అనంతరం, చంద్రబాబును హత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు 1978లో చంద్రగిరి నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన... 1983లో టీడీపీలోకి చేరారు. అప్పటికే ఆయన ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి పెళ్లాడారు.
చంద్రబాబు 1995లో తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో తొలిసారిగా ఎన్డీయేకు మద్దతు ప్రకటించారు. అదే ఏడాది రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2003లో అలిపిరి వద్ద నక్సల్స్ అమర్చిన క్లేమోర్ మైన్స్ దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. 2004 ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు అధికారం కోల్పోయారు.
తిరిగి 2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించడంతో చంద్రబాబు మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు లేకుండా పోటీ చేసిన టీడీపీ ఓటమిపాలైంది.
ఈసారి 2024 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న టీడీపీ బ్రహ్మాండమైన విజయం సాధించడంతో చంద్రబాబు నాలుగో పర్యాయం సీఎం అయ్యారు.