G Jagadish Reddy: రుణమాఫీపై దృష్టి మరల్చేందుకే కాళేశ్వరం, కమీషన్ల అంశం: జగదీశ్ రెడ్డి
- కాంగ్రెస్ పసలేని ఆరోపణలన్నీ వరుసగా తేలిపోతున్నాయన్న జగదీశ్ రెడ్డి
- నీళ్ళు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్న బీఆర్ఎస్ నేత
- మీడియాకు లీకులిచ్చి చెత్త , రోత రాతలు రాయిస్తున్నారని ఆగ్రహం
విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి బుధవారం స్పందించారు. రుణమాఫీపై దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ల అంశంపై మాట్లాడుతోందని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆరు నెలలైనప్పటికీ హామీల అమలు మరచి గత ప్రభుత్వాలపై నిందలు వేస్తూ కాంగ్రెస్ పబ్బం గడుపుతోందని మండిపడ్డారు.
ప్రభుత్వం చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ కమీషన్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. విచారణ కమీషన్లు వాటి పని అవి చేసుకుంటాయని... ప్రభుత్వం లీకులు ఎందుకు ఇస్తోందని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ముగిశాక హామీల అమలుపై ప్రజలు నిలదీస్తారని కమీషన్ల విచారణ పేరుతో మీడియాకు లీకుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పసలేని ఆరోపణలన్నీ వరుసగా తేలిపోతున్నాయన్నారు. కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించకుండా తప్పు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ పేరుతో నాలుగు నెలలుగా సమయం వృథా చేసి ఇప్పుడు హడావుడి చేస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వంలో లోపాలు అంటూ... ఏమీ లేకుండానే ఆరోపణలు చేస్తున్నారని... దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. నీళ్లు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలు ఇప్పుడు మంచినీళ్ళ కోసం కూడా రోడ్డెక్కే పరిస్థితి నెలకొందన్నారు. పదేళ్ల క్రితం ఉన్న దారుణ పరిస్థితులు మళ్లీ వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అంశాల్లో ప్రభుత్వం చేతగానితనాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. మీడియాకు లీకులు ఇచ్చి చెత్త, రోత రాతలు రాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పాలనపై ఎన్ని కమిషన్లు వేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ కమిషన్ల విచారణ కంటే మీడియా లీకులు ఎక్కువయ్యాయని విమర్శించారు. విచారణ పేరుతో రుణమాఫీ నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.