Vijayasai Reddy: రాజ్యసభలో బీజేపీకి మా అవసరం ఉంటుందన్న విషయం గుర్తించాలి: విజయసాయిరెడ్డి
- వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డిలతో కలిసి విజయసాయి ప్రెస్ మీట్
- లోక్ సభలో టీడీపీ బలం 16 మంది అని వెల్లడి
- తమకు రాజ్యసభలో 11 మంది, లోక్ సభలో నలుగురు ఉన్నారని వివరణ
- రాజ్యసభలో బిల్లు పాస్ చేయాలంటే తమ మద్దతు తప్పనిసరి అని స్పష్టీకరణ
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ తమ పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"లోక్ సభలో టీడీపీకి ఉన్నది 16 మంది ఎంపీలే. మాకు పార్లమెంటు ఉభయ సభల్లో కలిపి 15 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో వైసీపీకి 11 మంది, లోక్ సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ కూడా భాగస్వామి అయినప్పటికీ, రాజ్యసభ విషయానికొచ్చేసరికి బీజేపీకి మా పార్టీ అవసరం ఉంటుందన్న విషయం గుర్తించాలి.
రాజ్యసభలో ఏదైనా బిల్లు పాస్ చేయాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి. పార్లమెంటులో వాళ్లు టీడీపీపై ఎంత ఆధారపడతారో, వైసీపీపైనా అంతే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సంఖ్యాపరంగా టీడీపీతో మేం దాదాపు సమానంగానే ఉన్నాం" అని విజయసాయి వివరించారు.