CM Chandrababu: అలిపిరి దాడి నుంచి వెంకన్నే నన్ను కాపాడారు: చంద్రబాబు
- తన వల్ల జరగాల్సిన కార్యక్రమాలు ఉన్నాయనే కాపాడి ఉంటాడని వెల్లడి
- దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేలా ఏపీ ప్రజలకు ఇచ్చిన వరమే ఈ విజయం
- శ్రీవారిని దర్శించుకున్న తర్వాత సీఎంగా తొలి ప్రెస్ మీట్
తిరుమల వెంకన్న తమ కులదైవమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఏ పని మొదలుపెట్టినా ముందు శ్రీవారిని స్మరించుకున్నాకే ముందుకు వెళతానని చెప్పుకొచ్చారు. ఉదయం నిద్రలేస్తూనే నిండు మనసుతో ఒక్క నిమిషం వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తానని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు. ఈమేరకు గురువారం ఉదయం చంద్రబాబు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం అందుకున్నామని చంద్రబాబు చెప్పారు.
తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశాను కానీ ఇంత స్పష్టంగా, 93 శాతం సీట్లతో ఏ ఎన్నికలలోనూ ప్రజలు తీర్పు ఇవ్వలేదని చెప్పారు. ఇదంతా తిరుమల శ్రీవారి దయేనని చెప్పుకొచ్చారు. అలిపిరిలో తనపై జరిగిన దాడిని గుర్తుచేసుకున్న చంద్రబాబు.. నాడు తనను కాపాడింది వెంకటేశ్వరుడేనని వివరించారు. దర్శనానికి వస్తుండగా తన ప్రాణం పోతే ఆయనపైనే నింద పడుతుందని అనుకున్నారో లేక తన వల్ల జరగాల్సిన పనులు ఉన్నాయనో బతికించాడని చెప్పారు. తెలుగు జాతికి తాను సేవ చేయాల్సి ఉందనే కాపాడాడని అన్నారు.
తాజా ఎన్నికల్లో టీడీపీకి కీలక విజయం కట్టబెట్టి దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేలా చేశాడన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తిరుపతి వెంకన్న ఇచ్చిన వరమని చెప్పారు. ప్రపంచంలో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. సంపద సృష్టించాలి.. సృష్టించిన ఆ సంపద పేదలకు చేరాలనేదే తన ఉద్దేశమని వివరించారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే తన లక్ష్యమని చంద్రబాబు చెప్పుకొచ్చారు.