T20 World Cup 2024: అమెరికాపై గెలుపుతో సూపర్-8లోకి భారత్.. ఇప్పుడు పాకిస్థాన్ పరిస్థితి ఇదే!
- అమెరికాపై గెలుపుతో నాకౌట్ దశలోకి భారత్
- గ్రూప్-ఏ నుంచి మరో స్థానం కోసం పాకిస్థాన్, యూఎస్ఏ పోటీ
- కీలకం కానున్న అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్
- అమెరికా గెలిస్తే నేరుగా సూపర్-8కి అర్హత.. ఓడితే పాక్‌కు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో అమెరికాపై గెలుపుతో భారత్ సూపర్-8 దశలోకి అడుగుపెట్టింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచి గ్రాండ్‌గా నాకౌట్ దశలో స్థానం ఖరారు చేసుకుంది. గ్రూప్-ఏలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 6 పాయింట్లతో సూపర్-8కు అర్హత సాధించింది.
అయితే భారత్ గెలుపుతో దాయాది దేశం పాకిస్థాన్ సూపర్-8 సమీకరణాలు ఆసక్తికరంగా మారియి. పాకిస్థాన్ కూడా నాకౌట్ దశకు క్వాలిఫై కావాలంటే ఈ నెల 14న జరగనున్న అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్ ఫలితం కీలకం కానుంది.
ఐర్లాండ్‌పై మ్యాచ్‌లో అమెరికా ఓడిపోయి.. ఐర్లాండ్‌పై పాకిస్థాన్ గెలిస్తే 4 పాయింట్లతో దాయాది దేశం సూపర్-8లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇరు జట్లకు సమానమైన పాయింట్లు ఉంటాయి కాబట్టి నెట్ రన్ రేట్ కూడా కీలకం అవుతుంది. ఒకవేళ ఐర్లాండ్‌పై అమెరికా గెలిస్తే 6 పాయింట్లతో తదుపరి దశలోకి ఎంటర్ అవుతుంది. ఈ సమీకరణంలో పాక్ టోర్నీ నుంచి నిష్ర్కమించాల్సి ఉంటుంది.