Kuwait Fire Accident: కువైట్ అగ్నిప్రమాదం.. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన శరీరాలు
- బాధితులను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్ష నిర్వహణ
- ఎయిర్ ఫోర్స్ విమానంలో మృతదేహాలను భారత్ కు తీసుకురానున్న ప్రభుత్వం
- ప్రధాని ఆదేశాలతో కువైట్ వెళ్లిన విదేశాంగ శాఖ సహాయమంత్రి
కువైట్ లో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో 42 మంది భారత వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎక్కువగా కేరళ, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారని సమాచారం. అయితే, అగ్నిప్రమాదంలో కొంతమంది బాధితుల శరీరాలు తీవ్రంగా కాలిపోయాయని, దీనివల్ల బాధితులను గుర్తించడం కష్టమవుతోందని కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. బాధితులను గుర్తించేందుకు మృతదేహాలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కారణంగా మృతదేహాల తరలింపు కొంత ఆలస్యం కానుందని వివరించారు. భారత కార్మికుల మృతదేహాలను తీసుకురావడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఇప్పటికే కువైట్ చేరుకుందని తెలిపారు.
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ను వెంటనే కువైట్ వెళ్లాలని ఆదేశించారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు గురువారం ఉదయమే కీర్తి వర్ధన్ సింగ్ కువైట్ చేరుకున్నారు. ఈ ప్రమాదంపై విదేశాంగ శాఖ అధికారులతో సమీక్ష జరిపిన మోదీ.. బాధిత కుటుంబాలను అన్నిరకాలుగా ఆదుకోవాలని, మృతదేహాలను సాధ్యమైనంత త్వరగా స్వస్థలాలకు చేర్చాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని.. తక్షణ సాయంగా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు వలస వెళ్లిన వారు ఈ విధంగా చనిపోవడం బాధాకరమని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించి, నిందితులను కఠినంగా శిక్షించాలని కువైట్ ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.
అల్ మంగాఫ్ బిల్డింగ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మొత్తం 49 మంది చనిపోయినట్లు కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదానికి కారణాన్ని గుర్తించేందుకు నిపుణులతో పరీక్షలు జరుపుతున్నట్లు వివరించింది. బిల్డింగ్ యాజమానులను అరెస్టు చేయడానికి ఆదేశాలు జారీ చేసినట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో 42 మంది భారతీయులేనని అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారులు చెప్పారు. కేరళకు చెందిన 11 మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారని వివరించారు.