Mohammad Kaif: కోహ్లీ విషయంలో ఆ నిర్ణయం తప్పు.. అలా చేస్తే టీం నష్టపోతుంది: మహమ్మద్ కైఫ్
- 2024 టీ20 ప్రపంచకప్ లో టీమిండియా అద్భుత ప్రదర్శన
- వరుసగా మూడు విజయాలతో సూపర్-8కి రోహిత్ సేన
- విరాట్ కోహ్లీతో ఓపెనింగ్ చేయించడం భారత జట్టుకు నష్టమన్న కైఫ్
- రిషబ్ పంత్‌తో కలిసి ఓపెనింగ్ చేయాలని కెప్టెన్ రోహిత్ శర్మకు సూచన
2024 టీ20 ప్రపంచకప్ లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. వరుసగా మూడు విజయాలతో సూపర్-8కి చేరింది రోహిత్ సేన. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం రాబోయే మ్యాచ్‌లలో భారత జట్టుకు నష్టం కలిగించే అవకాశం ఉందని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. టీ20లో టీమిండియా ఓపెనర్స్‌గా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ క్రీజ్‌లోకి వస్తున్నారు. ఇదే అంశంపై తాజాగా మాట్లాడిన రోహిత్ శర్మ.. జట్టులో ఓపెనింగ్ జోడీ ఫిక్స్‌గా ఉందని.. భవిష్యత్‌లో కూడా విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని హిట్ మ్యాన్ చెప్పాడు. రోహిత్ నిర్ణయంపై కైఫ్ స్పందించాడు. ఈ సందర్భంగా రోహిత్‌కు ఓ సలహా కూడా ఇచ్చాడు.
విరాట్ కోహ్లీ తొలిసారిగా టీ20లో భారత్ జట్టు ఓపెనర్‌గా దిగుతున్నాడు. అయితే, ఇప్పటి వరకు ఈ స్థానంలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే ఇప్పుడు భారత జట్టును, భారత క్రికెట్ అభిమానులను కలవర పెడుతోంది. టోర్నీలోని మూడు మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ చాలా త్వరగా పెవిలియన్ చేరాడు. దీంతో మిడిల్ ఓవర్‌లో పరుగులు రాబట్టడంలో టీమిండియా విఫలమవుతోంది. ఈ నేపథ్యంలోనే స్పందించిన కైఫ్.. రాబోయే మ్యాచ్‌లో రిషబ్ పంత్‌తో కలిసి ఓపెనింగ్ చేయాలని కెప్టెన్ రోహిత్ శర్మకు సూచించాడు. విరాట్ కోహ్లీని యథావిధిగా మూడో స్థానంలో దించాలని సూచించాడు.
యూఎస్ లో క్రికెట్ స్టేడియం పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంది. వెస్టిండీస్‌లో భారత జట్టు స్లో పిచ్‌పై ఆడాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఓపెనర్స్ ఔట్ అయినా.. ఆ తరువాత ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బ్యాట్స్‌మెన్ అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు జట్టులోని ఇతర బ్యాట్స్‌మెన్ ఆ పని చేయడంలో విఫలమయ్యారు. అటాకింగ్ ఫార్మాట్‌లో కాకుండా.. వికెట్లు కాపాడుకుంటూ ఆడాలని టీమిండియాకు కైఫ్ సూచించాడు. అందుకే విరాట్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్ కు దింపడమే సరైన నిర్ణయం అవుతుందని కైఫ్ చెప్పుకొచ్చాడు.