Telangana: అన్న క్యాంటీన్ల తరహాలో తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీస్‌లు: సీఎస్ శాంతికుమారి
- రెండేళ్లలో 150 మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడి
- కలెక్టరేట్లు, బస్టాండ్లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాల్లో క్యాంటీన్ల ఏర్పాటు
- బెంగాల్లో దీదీ కా రసోయి, కేరళలో అన్నక్యాంటిన్లపై అధ్యయనం చేసినట్లు వెల్లడి
అన్న క్యాంటీన్ల తరహాలో తెలంగాణలో 'మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులు' ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. రాష్ట్రంలో 'మహిళా శక్తి - క్యాంటీన్ సర్వీస్'ల ఏర్పాటుపై ఈరోజు సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రెండేళ్లలో 150 మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కలెక్టరేట్లు, బస్టాండ్లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. క్యాంటీన్ల నిర్వహణపై గ్రామైక్య సంఘాలకు శిక్షణ ఇస్తామన్నారు. ఈ క్యాంటీన్ల కోసం బెంగాల్లో దీదీ కా రసోయ్, కేరళలో అన్న క్యాంటీన్లపై అధ్యయనం చేసినట్లు చెప్పారు. మహిళా సంఘాలను బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ క్యాంటీన్ల పనితీరు, నిర్వహణ, వీటి ఏర్పాటుకు ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం, వీటి ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తదితర అంశాలపై సవివరంగా ప్రణాళికను రూపొందించాల్సిందిగా గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్‌ను సీఎస్ ఆదేశించారు.