Dr Pemmasani Chandrasekhar: కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెమ్మసాని
- గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయమంత్రిగా పెమ్మసాని నియామకం
- ప్రధాని మోదీకి, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పెమ్మసాని
- అంచనాలకు తగ్గని రీతిలో పనిచేస్తానని వెల్లడి
టీడీపీ గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నేడు ఢిల్లీలో కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్డీయే ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ, కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రిగా పెమ్మసానికి అవకాశం దక్కడం తెలిసిందే. ఇవాళ బాధ్యతలు అందుకున్న అనంతరం పెమ్మసాని సోషల్ మీడియాలో స్పందించారు.
"ఢిల్లీలోని సంచార్ భవన్ లో కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించాను. మహోన్నత భారతదేశ ప్రజలకు సేవ చేసే ఈ విశిష్ట అవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఎంతో అనుభవశీలి, విషయ పరిజ్ఞానం ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ (గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి), జ్యోతిరాదిత్య సింథియా (కమ్యూనికేషన్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ) గారి మార్గదర్శకత్వంలో పనిచేయనుండడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో పనిచేస్తానని, నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చిన నేతలు గర్వపడేలా పనిచేస్తానని హామీ ఇస్తున్నా" అంటూ పెమ్మసాని వివరించారు.