BPCL Refinery: రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటులో బీపీసీఎల్.. ఏపీకి రప్పించే ఏర్పాట్లలో అధికారుల బిజీ!

BPCL ready to set up refinery project and AP trying to bring them to state

  • రూ. 50 వేల కోట్ల పెట్టుబడితో రిఫైనరీ ఏర్పాటుకు బీపీసీఎల్ ఏర్పాట్లు
  • పోటీపడుతున్న ఉత్తరప్రదేశ్, గుజరాత్ ప్రభుత్వాలు
  • బీపీసీఎల్ సీఈవోతో ఏపీ ఉన్నతాధికారుల సంప్రదింపులు
  • మధ్యప్రదేశ్ ఇచ్చినట్టు ప్రోత్సాహకాలు ఇస్తే రెడీ అన్న బీపీసీఎల్
  • చంద్రబాబుకు చెప్పి మళ్లీ వస్తామన్న అధికారులు
  • ప్రాజెక్టు వస్తే వేలాదిమందికి ఉపాధి అవకాశాలు

ఓ భారీ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఓ రిఫైనరీ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బీపీసీఎల్‌కు ఇప్పటికే ముంబై, కొచ్చి, బినా (మధ్యప్రదేశ్‌) లలో రిఫైనరీలు ఉన్నాయి. ఇప్పుడు మరో దానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంస్థ.. అందుకోసం అనువైన ప్రాంతాన్ని పరిశీలిస్తోంది.

రూ. 50 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ రిఫైనరీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభించనుంది. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. ఆ ప్రాజెక్టును సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే ప్రాజెక్టు కోసం మరోవైపు ఉత్తరప్రదేశ్, గుజరాత్ కూడా పోటీపడుతున్నాయి. రిఫైనరీల ఏర్పాటుకు తీర ప్రాంతం అనువైనదని, తమ రాష్ట్రం విస్తృతమైన తీరప్రాంతాన్ని కలిగి ఉన్నదని, కాబట్టి రాష్ట్రానికి వచ్చి పరిశీలించాలని ఏపీ అధికారులు సంస్థను కోరినట్టు తెలిసింది.

ప్రోత్సాహకాలు ఇస్తే రెడీ
ఏపీ అధికారుల వివరణతో సంతృప్తి వ్యక్తం చేసిన బీపీసీఎల్ సీఈవో ప్రోత్సాహకాలపై ఆరా తీసినట్టు సమాచారం. మధ్యప్రదేశ్‌లో రిఫైనరీ ఏర్పాటు చేసినప్పుడు అక్కడి ప్రభుత్వం రూ. 500 కోట్ల రుణం ఇవ్వడంతోపాటు, 15 ఏళ్లపాటు జీఎస్టీ మినహాయింపులు కూడా ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇలాంటి ప్రోత్సాహకాలే ఇస్తామంటే పెట్టుబడులకు తాము రెడీ అని ఏపీ అధికారులతో పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ప్రస్తావించి మరోమారు సంప్రదింపులు జరుపుతామని పేర్కొన్నట్టు విశ్వసనీయ సమాచారం. 

అంతేకాదు, ఇదే విషయమై కేంద్రానికి లేఖ రాయడంతోపాటు విభజన చట్టంలో పేర్కొన్న పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్, రిఫైనరీ ప్రాజెక్టు విషయాన్ని పరిశీలించాలని కోరనున్నట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News