Gorantla Butchaiah Chowdary: జగన్ మళ్లీ జనంలోకి వస్తే జరిగేది ఇదే!: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Gorantla slams YS Jagan

  • మళ్లీ ప్రజల్లోకి రావాలని జగన్ నిర్ణయం
  • జగన్ చేసిన నిర్వాకానికి జనంలోకి వస్తే రాళ్లు, చెప్పులు వేస్తారన్న బుచ్చయ్య  
  • ఐదేళ్ల తర్వాత ఏ జైల్లో ఉంటాడో తెలియదు అంటూ వ్యంగ్యం
  • మంత్రి పదవి రానందుకు తానేమీ చింతించడంలేదని స్పష్టీకరణ

టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి నేడు మీడియాతో మాట్లాడారు. మళ్లీ ప్రజల్లోకి రావాలని జగన్ నిర్ణయం తీసుకోవడం పట్ల వ్యంగ్యం ప్రదర్శించారు. జగన్ చేసిన నిర్వాకానికి మళ్లీ జనంలోకి వస్తే రాళ్లు, చెప్పులు వేస్తారని, జరిగేది ఇదేనని అన్నారు.

బూతులు తిట్టేవాళ్లను సంకలో పెట్టుకుని తిరిగే జగన్ మోహన్ రెడ్డి ఇవాళ నీతులు చెబుతున్నాడని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ ను వదిలి ఏనాడైనా ప్రజల్లోకి వచ్చావా? అని ప్రశ్నించారు. ఐదేళ్ల తర్వాత చంచల్ గూడ జైల్లో ఉంటాడో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడో తెలియదు అని ఎద్దేవా చేశారు. 

నాడు తండ్రిని అడ్డంపెట్టుకుని దోచుకున్నది కొంతే... ఈ ఐదేళ్లలో అంతకు 10 రెట్లు ఎక్కువ దోచుకున్నాడని గోరంట్ల ఆరోపించారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరుగుతుందని, దోషులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. హత్యా రాజకీయాలు, దోపిడీకి పాల్పడిన జగన్ శిక్షకు అర్హుడు అని స్పష్టం చేశారు. 

ఇక తనకు మంత్రి పదవి రాకపోవడంపైనా గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఈసారి టీడీపీ... జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుందని... పొత్తు ధర్మం ప్రకారం సీట్ల సర్దుబాటు, మంత్రిపదవుల సర్దుబాటు తప్పదని, కొన్ని సామాజిక సమీకరణాలు కూడా చూసుకున్న మీదట తనకు మంత్రి పదవి రాలేదని వెల్లడించారు. అందుకు తానేమీ చింతించడంలేదని తెలిపారు. 

"మంత్రి పదవి వస్తుందని నా వరకు నేను ఆశించాను... రాజకీయ కెరీర్ ఆఖరి దశలో గుర్తింపు వస్తుందని భావించాను. అయినా... మంత్రి పదవి రాకపోతే ఏమవుతుంది? ఇదివరకు పదవి ఉంటేనే పని చేశామా? నాలుగు పర్యాయాలు రాజమండ్రిలో ఏ పదవి ఉంటే పనిచేశాను? రాజమండ్రి రూరల్ లో మూడు పర్యాయాలు ఏ పదవి ఉంటే పనిచేశాను? పదవులు ముఖ్యం కాదు... పనిచేయడం ముఖ్యం. అయితే పదవి ఉంటే కొన్ని వెసులుబాట్లు ఉంటాయి" అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వివరించారు.

  • Loading...

More Telugu News