Shakib Al Hasan: సెహ్వాగ్ ఎవరు? నాకు తెలియదే?... బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ వ్యాఖ్యలు వైరల్
- టీ20 వరల్డ్ కప్ లో పెద్దగా ఆకట్టుకోని షకీబ్ అల్ హసన్
- ఎప్పుడో రిటైర్ కావాల్సినవాళ్లు ఇంకా ఆడుతుంటే ఇలాగే ఉంటుందన్న సెహ్వాగ్
- ఇలాంటి విమర్శలకు బదులివ్వాల్సిన అవసరం లేదన్న షకీబ్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సీనియర్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ (37) కు వివాదాలు కొత్త కాదు. తలబిరుసు వ్యాఖ్యలు చేయడం అతడికి అలవాటే. తాజాగా, టీ20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై బంగ్లాదేశ్ నెగ్గిన అనంతరం షకీబ్ మాట్లాడుతూ, టీమిండియా దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ ఎవరో తనకు తెలియదని వ్యాఖ్యానించాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే... టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లతో బంగ్లాదేశ్ ఆడిన మ్యాచ్ లలో షకీబ్ అల్ హసన్ విఫలమయ్యాడు. రెండు మ్యాచ్ ల్లోనూ సింగిల్ డిజిట్ పరుగులకే పరిమితమైన ఈ లెఫ్ట్ హ్యాండర్... బౌలింగ్ లోనూ తేలిపోయాడు. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
ముఖ్యంగా, దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో షకీబ్ పరమ చెత్తగా అవుటయ్యాడు. అతడు అవుటైన తీరు విమర్శలకు దారితీసింది. ఎప్పుడో రిటైర్ కావాల్సిన ఆటగాడు ఇంకా ఆడుతూనే ఉంటే ఇలాగే ఉంటుందని సెహ్వాగ్ విమర్శించాడు.
అయితే, నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయంలో షకీబ్ కీలక పాత్ర పోషించాడు. 64 పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో తోడ్పాటు అందించాడు.
మ్యాచ్ అనంతరం సెహ్వాగ్ వ్యాఖ్యల గురించి షకీబ్ ను ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా... సెహ్వాగా? అతడెవరు? అంటూ తిరిగి ప్రశ్నించాడు. విమర్శకులు ఏదో మాట్లాడుతుంటారు... వాళ్లకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు అని షకీబ్ స్పష్టం చేశాడు. జట్టుకు మనం ఎలా ఉపయోగపడుతున్నామన్నదే ఆలోచించాలి... అలా ఆలోచించని వాళ్లే అవసరంలేని విషయాల గురించి మాట్లాడుతుంటారు అని వ్యాఖ్యానించాడు.