Parimal Nathwani: జగన్ ను కలిసిన రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ
- 2020లో వైసీపీ కోటాలో రాజ్యసభకు వెళ్లిన పరిమళ్ నత్వానీ
- ఇటీవలి ఎన్నికల్లో వైసీపీకి దారుణమైన ఫలితాలు
- నేడు వైసీపీ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో జగన్ సమావేశం
రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలో కీలక వ్యక్తిగా ఉన్న పరిమళ్ నత్వానీ ఏపీ కోటాలో రాజ్యసభ అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. 2020లో వైసీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన నలుగురిలో పరిమళ్ నత్వానీ కూడా ఉన్నారు. నత్వానీకి వైసీపీతో ఎలాంటి సంబంధం లేకపోయినా, ముఖేశ్ అంబానీ కారణంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇక, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. లోక్ సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో, నేడు పరిమళ్ నత్వానీ... వైసీపీ అధినేత జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ జగన్ వైసీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. వైసీపీ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, గురుమూర్తి, పరిమళ్ నత్వానీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై జగన్ తమ పార్టీ ఎంపీలతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు.