Chandrababu: మంత్రి పదవులు దక్కని సీనియర్లకు చంద్రబాబు భరోసా
- కొలువుదీరిన చంద్రబాబు 4.0 క్యాబినెట్
- నేడు శాఖల కేటాయింపు
- అయ్యన్న, గోరంట్ల, ధూళిపాళ్ల, నక్కా ఆనంద్ బాబులకు దక్కని మంత్రి పదవులు
- పదవి దక్కని వాళ్ల సేవలు మరో రూపంలో ఉపయోగించుకుంటామన్న చంద్రబాబు
చంద్రబాబు 4.0 క్యాబినెట్ చూస్తే, కొత్తవాళ్లే ఎక్కువమంది కనిపిస్తారు. అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమ వంటి సీనియర్లకు ఈసారి మంత్రివర్గంలో స్థానం లభించలేదు.
ఈ నేపథ్యంలో, నేడు సీఎం చంద్రబాబును మంత్రి పదవులు దక్కని సీనియర్లు కలిశారు. ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనంద్ బాబు, యనమల రామకృష్ణుడు తదితరులు చంద్రబాబును కలిశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర క్యాబినెట్ కూర్పు ఏ ప్రాతిపదికన చేశామో వారికి వివరించారు. మంత్రివర్గంలో స్థానం లభించలేదని నిరాశ చెందవద్దని, మంత్రి పదవులు దక్కని వారి సేవలను ఇతర రూపాల్లో వినియోగించుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.
అటు, మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత తదితరులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తమకు మంత్రులుగా అవకాశం ఇవ్వడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రులుగా బాధ్యతతో పనిచేయాలని చంద్రబాబు వారికి సూచించారు.