Narendra Modi: మానవ-కేంద్రీకృత ఏఐ విధానం ద్వారా మెరుగైన భవిష్యత్తు: జీ7 సదస్సులో మోదీ
- ఈ దిశగా భారత్ కృషి చేస్తోందన్న భారత ప్రధాని
- సామాజిక అసమానతల తగ్గింపునకు టెక్నాలజీ వినియోగం పెరగాలన్న మోదీ
- జీ7 సదస్సులో ‘అందరికీ ఏఐ’ అనే అంశంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఇటలీలో ‘జీ7 సదస్సు 2024’ వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సామాజిక అసమానతలను తగ్గించేందుకు టెక్నాలజీ వినియోగంలో సహకారానికి ప్రయత్నాలు జరగాలని మోదీ శుక్రవారం పిలుపునిచ్చారు. టెక్నాలజీ ప్రయోజనాలను అందిపుచ్చుకుంటూనే సైబర్ సెక్యూరిటీ సవాళ్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మెరుగైన భవిష్యత్ నిర్మించేందుకు భారత్ ‘మానవ-కేంద్రీకృత విధానం’ కోసం పాటుపడుతోందని ఆయన చెప్పారు. జీ7 ఔట్‌రీచ్ సెషన్‌లో భాగంగా ‘అందరికీ ఏఐ’ అనే అంశంపై ప్రధాని మోదీ శుక్రవారం ఈ మేరకు కీలక ప్రసంగం చేశారు.
సాంకేతికతను సృజనాత్మక ప్రయోజనాల కోసం వినియోగించాలని, విధ్వంసానికి కాదని మోదీ సూచించారు. సానుకూల ఫలితాలతో మాత్రమే సమ్మిళిత సమాజానికి పునాది వేయగలుగుతామని అభిలషించారు. కాగా ఏఐ ఆధారిత మానవ-కేంద్రీకృత విధానం రూపొందించిన మొదటి కొన్ని దేశాలలో భారత్ ఉందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై జాతీయ వ్యూహంలో భాగంగా ఈ ఏడాది ఏఐ మిషన్‌ను ప్రారంభించామని మోదీ ప్రస్తావించారు.
సాంకేతికత ప్రయోజనాలు సమాజంలోని అన్ని మూలలకు చేరేలా ప్రపంచ వ్యాప్తంగా భాగస్వాములు అందరూ కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. టెక్నాలజీకి సంబంధించిన అత్యుత్తమ ఫలాలు అందరికీ చేరాలని అన్నారు. భవిష్యత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పారదర్శకంగా, న్యాయంగా, సురక్షితంగా, గోప్యంగా, బాధ్యతాయుతంగా ఉండేలా అన్ని దేశాలు కలిసి పనిచేయాలని మోదీ సూచించారు. జీ20 అధ్యక్ష దేశంగా ఉన్న సమయంలో అంతర్జాతీయ పాలనలో ఏఐ పాలనను భారత్ నొక్కి చెప్పిందని ప్రస్తావించారు.
ఇక ఎన్నికల ప్రక్రియలో టెక్నాలజీ వినియోగంపై కూడా మోదీ స్పందించారు. ఇటీవల ముగిసిన భారత లోక్‌సభ ఎన్నికలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించి ఎన్నికల ప్రక్రియలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎంత పెద్ద ఎన్నికలైనా ఫలితాలను కొన్ని గంటల్లోనే ప్రకటించగలుతున్నారని ప్రస్తావించారు. ఇక భారత ప్రజలు వరుసగా మూడోసారి సేవ చేసే అవకాశం తనకు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని మోదీ అన్నారు.