Job Applicant: ‘సార్.. ఈ జాబ్ రాకుంటే చిన్ననాటి ప్రియురాలు నాకు దక్కదు’ అంటూ ఓ నిరుద్యోగి వేడుకోలు

A Job Applicant Unusual Request To Hire Him
  • స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హెచ్ ఆర్
  • వైరల్ గా మారిన పోస్టు.. నిజాయతీగా చెప్పాడంటూ నెటిజన్ల కామెంట్
  • చిన్ననాటి ప్రేమ అంటున్నాడు, ఉద్యోగం ఇచ్చేసేయండని సూచనలు
ఏ ఉద్యోగానికి వెళ్లినా నిరుద్యోగులు సాధారణంగా ఎదుర్కొనే ప్రశ్న.. ఈ జాబ్ కు మీరు ఎలా సూట్ అవుతారు?.. సాధారణంగా అనిపించే ఈ ప్రశ్నకు ఇచ్చే జవాబుపైనే చాలా వరకు ఉద్యోగం ఇవ్వాలా వద్దా అనేది తేలిపోతుందట. మరి ఇంతటి ముఖ్యమైన ప్రశ్నకు ఓ అభ్యర్థి ఇచ్చిన జవాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసి చాలామంది నెటిజన్లు ఆ నిరుద్యోగిలో తమను తాము చూసుకుంటున్నారు. తప్పకుండా అతడికే జాబ్ ఇవ్వాలని కంపెనీకి సూచిస్తున్నారు. ఇంతకీ ఏంటా జవాబు.. నెటిజన్లు ఎందుకు మద్దతిస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.

ఆర్వా హెల్త్ గ్రూప్ కంపెనీ ఇటీవల ఓ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది. తమ కంపెనీలో వివిధ ఖాళీల భర్తీకి తగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సదరు పోస్టుకు మీరు ఎలా సూట్ అవుతారనేది క్లుప్తంగా రాసి పంపించాలని చెప్పింది. పేరున్న కంపెనీ కావడంతో చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అందులో ఓ అప్లికేషన్ హెచ్ ఆర్ సిబ్బందిని ఆకర్షించింది. సదరు క్యాండిడేట్ తన అర్హతలతో పాటు తనకే ఆ జాబ్ ఇవ్వాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ.. ‘సార్ ఈ ఉద్యోగం కనుక రాకుంటే నా చిన్ననాటి ప్రియురాలు నాకు దూరమవుతుంది. ఆమెను పెళ్లిచేసుకోలేను’ అంటూ వేడుకున్నాడు.

కాబోయే అల్లుడికి మంచి ఉద్యోగం ఉండాలన్న తన ప్రియురాలి తండ్రి కండీషన్ తన ప్రేమకు పెద్ద అడ్డంకిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిని స్క్రీన్ షాట్ తీసి హెచ్ ఆర్ ఉద్యోగి ఒకరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. హెచ్ ఆర్ ఉద్యోగం కూడా అప్పుడప్పుడూ ఫన్నీగానే ఉంటుందని క్యాప్షన్ పెట్టారు. దీనికి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఒక్కరోజులోనే ఏకంగా 2.2 లక్షల మందికి పైగా ఈ పోస్టు చూశారు. ఆ క్యాండిడేట్ ఎవరో కానీ అచ్చంగా నాలానే ఉన్నాడంటూ చాలామంది కామెంట్స్ పెట్టారు. అతని నిజాయతీకి నజరానాగా జాబ్ ఇవ్వాలని కొందరు, చిన్ననాటి ప్రేమ అంటున్నాడు కాబట్టి ఇచ్చేయండి సార్ ఉద్యోగం ఇచ్చేయండని మరికొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.
Job Applicant
Different Request
Hiring Process
Twitter

More Telugu News